దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాజపా స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు దూసుకెళుతోంది. దాదాపు విజయం ఖాయమైన వేళ ప్రపంచ దేశాల నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పొరుగుదేశాలైన శ్రీలంక, చైనా, భూటాన్, నేపాల్‌తో పాటు రష్యా, ఇజ్రాయెల్, ఆఫ్గానిస్థాన్ దేశాధినేతలు ట్విటర్ ద్వారా మోదీకి అభినందనలు తెలిపారు. ‘‘అద్భుతమైన విజయాన్ని సాధించిన నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు. రానున్న కాలంలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మోదీకి అభినందనలు తెలియజేస్తూనే.. భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మోదీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని వ్యాఖ్యానించారు. హిందీతో పాటు హీబ్రూలోనూ ఆయన ట్వీట్ చేయడం గమనార్హం.
అలాగే అఫ్గానిస్థాన్ ప్రధాని అష్రఫ్ ఘనీ స్పందిస్తూ.. ‘‘భారత ప్రజల మద్దతుతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న మోదీకి శుభాకాంక్షలు. శాంతి పరిరక్షణ, దక్షిణాసియాలో ప్రజల సంక్షేమం కోసం మీతో కలిసి నడిచేందుకు అఫ్గాన్ సిద్ధంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. వీరితో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జింగ్పింగ్ మోదీకి ఫోన్ ద్వారా అభినందనలు తెలియజేశారు. అలాగే నేపాల్, భూటాన్ దేశాధినేతలు కూడా సామాజిక మాధ్యమాల వేదికగా.. మోదీకి అభినందనలను తెలియజేశారు.