ముంబయి: దేశీయ మార్కెట్లు మళ్లీ బేర్మన్నాయి. ఒమన్ సముద్రంలో రెండు చమురు నౌకలపై దాడి నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరుగుతుండటం మదుపర్లను భయాందోళనకు గురిచేసింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు కూడా బలహీనంగా ఉండటం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు కుప్పకూలాయి.
చమురు భయాలతో ఆరంభ ట్రేడింగ్‌లోనే సూచీలు కుదలేయ్యాయి. 150 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్ ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. చివరి గంటల్లో బ్యాంకింగ్, ఆటో, ఫార్మా, లోహ, ఐటీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో సూచీలు భారీగా నష్టపోయాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 289 పాయింట్లు దిగజారి 39,452 వద్ద, నిఫ్టీ 91 పాయింట్ల నష్టంతో 11,823 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.75గా కొనసాగుతోంది.
ఎన్ఎస్ఈలో భారతీ ఇన్ఫ్రాటెల్, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, ఎల్ అండ్ టీ, వేదాంత షేర్లు స్వల్పంగా లాభపడగా.. ఇండస్ఇండ్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీగా నష్టపోయాయి.