‘మా’ అసోసియేషన్‌లో లుకలుకలు!
నరేశ్‌కు షోకాజ్ నోటీసు
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో మొదటి నుంచి లుకలుకలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ‘మా’ నూతన అధ్యక్షుడిగా నరేశ్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వివిధ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రమాణ స్వీకారం రోజున నరేశ్ మీడియాతో మాట్లాడిన తీరుపై కూడా ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నరేశ్ నేను, నేను అని కాకుండా.. మేమంతా అని ప్రస్తావిస్తే బాగుంటుంది’ అని నవ్వుతూనే చురకలు అంటించారు.
ఇప్పుడు రాజశేఖర్, నరేశ్‌ల మధ్య స్నేహబంధం మరింత దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. రాజశేఖర్ వర్గం నరేశ్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చింది. ‘మా’ అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసింది. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో 268 ఓట్లతో నరేశ్ అధ్యక్షుడిగా గెలుపొందిన సంగతి తెలిసిందే. జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్ గెలుపొందారు.