దాహం తీరుస్తూ... ఉపాధి పొందుతూ!

అది మెదక్‌ జిల్లా.  వర్షాభావం ఎక్కువగా ఉండే ప్రదేశం. కొన్ని గ్రామాల్లో అయితే... తాగునీటి కోసం బిందెలను తలపై పెట్టుకొని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తారు మహిళలు. ఇలాంటి వారి కష్టాలను గుర్తించిన సేఫ్‌ వాటర్‌ నెట్‌వర్క్‌ సంస్థ ఉచితంగా నీటిని శుద్ధి చేసే యంత్రాలను సమకూర్చింది. మహిళలకే వీటి నిర్వహణ బాధ్యతలు అప్పగించింది.  తాగునీటి కష్టాలు తీరడంతో పాటు వనితలు ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నారు.

స్వయం సహకార, ఉపాధి సంఘాల మహిళలను సమన్వయం చేసుకుంటూ సేఫ్‌ వాటర్‌ నెట్‌వర్క్‌ సంస్థ... ‘ఐ- జల్‌’ పేరిట తెలంగాణలోని 17 జిల్లాల్లో ఉచితంగా నీటిశుద్ధి కేంద్రాలను స్థాపించింది. ‘మన నీరు- మన ఆరోగ్యం’ అనే నినాదంతో రాష్ట్రంలో 250కి పైగా నీటిశుద్ధి కేంద్రాలను నెలకొల్పి, కేవలం ఐదు రూపాయలకే 20 లీటర్ల నీటిని అందిస్తోంది. వాటి నిర్వహణలో మహిళలను భాగస్వామ్యం చేస్తూ, వారికి ఆర్థిక భరోసా ఇస్తోంది.

అవసరాన్ని గుర్తిస్తారు...
కనీస అవసరాల్లో ఒకటైన తాగునీరును ఉచితంగా పేదవారికి అందించాలనే ఉద్దేశంతో సేఫ్‌ వాటర్‌ నెట్‌ వర్క్‌ స్వచ్ఛంద సంస్థను 2009లో రవీంద్రసేవక్‌ స్థాపించారు. ఆయన భార్య పూనం సేవక్‌ ప్రస్తుతం సంస్థ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ సంస్థ పనిచేస్తుంది. అన్ని రాష్ట్రాల్లో మంచినీటి సదుపాయం కల్పించాల్సిన ప్రాంతాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గుర్తిస్తుంది. ఆ సమాచారంతో రాష్ట్రాల సమన్వయంతో ఎక్కడెక్కడ కేంద్రాలను స్థాపించాలో ఈ సంస్థ నిర్ణయిస్తుంది. మొదట స్వయం ఉపాధి సంఘాల మహిళలతో సమావేశాలు నిర్వహించి, వారి  గ్రామాల్లో ఉచితంగా నీటిశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెబుతారు. మహిళలకే వాటి నిర్వహణ బాధ్యత అప్పగిస్తారు. దానిపై వీరికి ఉచిత శిక్షణా ఉంటుంది. వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని అడిగిన గ్రామాల్లో పరిస్థితులను అంచనా వేసి, ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారనుకుంటేనే అనుమతిస్తారు. వీటితో నీటి కష్టాలు తీరడమే కాదు, మహిళలకు ఇదో ఉపాధి మార్గంగానూ మారడంతో అనేక మంది లబ్ధిపొందుతున్నారు. ఆటోమేటిక్‌ యంత్రాలు, ముందుగానే రీఛార్జ్‌ చేసిన ఓ కార్డు సాయంతో ఏ సమయంలోనైనా తాగునీరు తీసుకెళ్లే ఏర్పాట్లు చేశారు. ఈ సంస్థ సేవలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇటీవల ఇంటర్నేషనల్‌ వాటర్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంస్థ... స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోంలో జరిగిన ఓ సదస్సులో మెదక్‌ జిల్లాలో సేఫ్‌ వాటర్‌ వర్క్‌ సేవలను ప్రశంసించింది. నీటికోసం బిందెలతో కిలోమీటర్ల దూరం వెళ్లిన మహిళలే నేడు స్వచ్ఛమైన తాగునీరు అందించడంతో పాటు, ఆర్థిక స్వేచ్ఛను పొందుతున్నారని పేర్కొంది.
పదేళ్ల కిందట మెదటి ప్లాంటును పూర్వ వరంగల్‌ జిల్లాలోని నిజాంపల్లిలో స్థాపించారు. అప్పటి మెదక్‌ జిల్లా పాలనాధికారి పార్థి హోలీకేరి ప్రోత్సాహంతో... జిల్లాలో 34 గ్రామాల్లో నీటిశుద్ధి కేంద్రాలను ఈ సంస్థ స్థాపించింది. ప్రస్తుతం తెలంగాణ 17 జిల్లాల్లోని దాదాపు 250 ప్లాంట్లతో పాటు మహారాష్ట్రలోనూ 50 కేంద్రాలను నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న 14 రాష్ట్రాలకూ సేవలను విస్తరించే పనిలో ఉంది ఈ సంస్థ.

కార్పొరేట్‌ సంస్థల సాయంతో...
ఫార్చ్యూన్‌ 500 అమెరికన్‌ కంపెనీల్లో ఒకటైన హనీవెల్‌ హోమ్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థ, సేఫ్‌ వాటర్‌ నెట్‌వర్క్‌ ఎన్జీవోకు నిధులు సమకూరుస్తోంది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నుంచి రెండు శాతం నిధులను ఇందుకు కేటాయిస్తోంది. అధునాతన యంత్రాలను సమకూర్చడంతో పాటు ప్రత్యక్షంగా నీటి శుద్ధి కేంద్రాల నిర్వహణను పర్యవేక్షిస్తుంది. పెప్సికో, టాటా స్టీల్స్‌ వంటి ఇతర కార్పొరేట్‌ సంస్థలూ తమవంతు సాయం అందిస్తున్నాయి.

పిల్లలను చదివించుకుంటున్నా 

మాది ఖమ్మంజిల్లా గొల్లపాడు. నా భర్త ఆటోడ్రైవర్‌. ఉపాధి హామీ క్షేత్ర సహాయకురాలిగా పనిచేస్తున్నా. ఐదేళ్ల క్రితం వర్షాలు లేక, బోర్లు, బావులు ఎండిపోవడంతో ఊర్లో అందరం తాగునీటి కోసం కష్టాలు పడ్డాం. అప్పట్లో ప్రైవేటు శుద్ధి కేంద్రా ల నుంచి తాగునీరు కొనే స్థోమత గ్రామంలో చాలా మందికి లేదు. అప్పుడే సేఫ్‌ వాటర్‌ నెట్‌వర్క్‌ సంస్థ గురించి తెలిసింది. సంస్థ ప్రతినిధులను కలిసి మా ఊర్లో నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు చేయమని కోరాం. అలా మా ఇంట్లోనే 2014లో ప్లాంటును ఏర్పాటు చేశాం. గ్రామ ప్రజల తాగునీటి కష్టాలు తీరాయి. మా కుటుంబానికీ ఇదో ఆదాయమార్గంగా మారింది. దీన్నుంచి వచ్చే డబ్బుతో పిల్లల్ని చదివించుకుంటున్నందుకు ఆనందంగా ఉంది.

సేవా భావంతోనే.. 

మాది మెదక్‌ జిల్లా వడియారం. నా భర్త ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తారు. మా మామగారి పేరుమీద ఏదైనా సేవా కార్యక్రమం మొదలుపెట్టాలనుకున్నాం. గ్రామంలో తాగునీటి సౌకర్యం లేక అందరూ మండల కేంద్రం నుంచి నీటి డబ్బాలను కొనుక్కోవడం చూశాం. సొంత ఊళ్లో మేమే అందరికీ తక్కువ ఖర్చులో తాగునీటి సదుపాయం కల్పించాలనుకున్నాం. ఈ క్రమంలోనే ఐజల్‌ వాటర్‌ప్లాంట్ల గురించి తెలిసింది. సంస్థ కార్యకర్తలను సంప్రదించి గతేడాది నీటిశుద్ధి కేంద్రాన్ని ప్రారంభించాం. సంస్థ పర్యవేక్షకులు నీటి నాణ్యత పరీక్షలు చేస్తూ, సూచనలు ఇస్తుండటం గమనించిన గ్రామ ప్రజలంతా ఇక్కడి నుంచే నీరు తీసుకెళ్లడం మొదలు పెట్టారు. ఊళ్లో సుమారు 700 కుటుంబాలు ఉండగా, దాదాపు 600 కుటుంబాలకు తాగునీరు అందిస్తున్నాం. వ్యాపార దృక్పథం కంటే సేవాభావంతోనే దీన్ని నిర్వహిస్తున్నాం. చుట్టుపక్కల గ్రామాల నుంచీ ఇక్కడికి వచ్చి నీరు తీసుకెళ్తున్నారు.

కొబ్బరిబోండాలు అమ్మేదాన్ని

మాది వరంగల్‌. పెళ్లయిన కొత్తలో కుటుంబ అవసరాలకోసం కొబ్బరిబోండాలు అమ్మేదాన్ని. అది ఏమాత్రం సంతృప్తినివ్వక సొంతంగా ఏదైనా చేయాలనుకున్నాం. అదే సమయంలో నీటిఎద్దడి కారణంగా స్థానికులు తాగునీటికి ఇబ్బందులు పడటం గమనించా. రోజూ శుద్ధి చేసిన తాగునీటిని కొనుక్కోవాలంటే కష్టమని గుర్తించా. దీని గురించి చుట్టుపక్కల వారితో మాట్లాడి సొంతంగా నీటిశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చాం. ఇందుకోసం వివిధ గ్రామాల్లో ఉన్న వాటర్‌ప్లాంట్లను పరిశీలించాం. వాటి గురించి ఆరాతీసినప్పుడు సేఫ్‌ వాటర్‌ నెట్వర్క్‌ సంస్థ ఉచితంగా ఐజల్‌ పేరిట నీటిశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని తెలిసి మేమూ సంప్రదించాం. ఇలా 2016లో మా ఇంట్లోనే నీటిశుద్ధి కేంద్రాన్ని ప్రారంభించాం. స్థానికులందరూ ఇక్కడి నుంచే నీరు తీసుకెళ్తారు. రోజూ 250 నుంచి 300 మంది నీటికోసం వస్తారు. సంస్థ ప్రతినిధులు 15 రోజులకు ఓసారి వచ్చి నీటిని పరీక్షలకు పంపిస్తారు. శుద్ధి చేసే ప్రక్రియను, నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షిస్తారు. యంత్రాలకు ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే... వారే వచ్చి ఉచితంగా మరమ్మతు చేస్తారు. 
 

మరిన్ని