ప్రేమ పేరుతో యువతిని వేధించి...
సస్పెండయిన పోలీసు
తాజా వేధింపులపై మరో కేసు నమోదు
ఈనాడు, విశాఖపట్నం: ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఓ యువతిని మోసం చేయడమే కాకుండా.. కేసు పెట్టిన తరువాత కూడా ఆమెను మరింతగా వేధిస్తున్న కానిస్టేబుల్ను ఉద్యోగం నుంచి పూర్తిగా తప్పించేందుకుగల అవకాశాలను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. తాజాగా మరో కేసు కూడా నమోదు చేశారు. కమిషనరేట్ పరిధిలోని ఓ కానిస్టేబుల్ నగరానికి చెందిన సదరు యువతికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి పేరు చెప్పగానే వేధించడం మొదలుపెట్టాడు. అతనితో తెగతెంపులు చేసుకున్నా కూడా వదిలిపెట్టలేదు. పలుసార్లు దాడులు చేయడంతో గాయాల తాలూకూ మచ్చలు ఆమె శరీరంపై శాశ్వతంగా నిలిచిపోయాయి. ఆ వేధింపులు తాళలేక రెండేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో కానిస్టేబుల్ దురాగతం నిర్ధారణ కావటంతో ఉన్నతాధికారులు అతనిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అనంతరం సస్పెండ్ చేశారు. ఇప్పటివరకు అతడిని విధుల్లోకి తీసుకోలేదు. అయినా.. అతను తన తీరు మార్చుకోకుండా మళ్లీ ఆ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. ఆమె ఉద్యోగం చేస్తున్న సంస్థ వద్దకెళ్లి ఇబ్బందులు పెట్టడం, వేర్వేరు ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్ చేసి వేధించడం చేస్తున్నాడు. బాధితురాలు సోమవారం మళ్లీ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకుంది. తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు.. అతనిపై మరో కేసు నమోదు చేశారు. అతనిపై తగిన చర్యలు తీసుకుంటామని డీసీపీ-2 బి.ఉదయభాస్కర్ చెప్పారు.