మా గురించే అలా రాస్తారెందుకు?

జీవితా-రాజశేఖర్‌.. ఇది అందరికీ నచ్చిన టైటిల్‌.. అందరూ మెచ్చిన టైటిల్‌.. జీవితా-రాజశేఖర్‌ల దాంపత్య జీవితం ఒక సినిమా అయితే, ఆ సినిమాకు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, మాటలు అన్నీ జీవితానే. సినిమాల్లోనే కాదు, సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న పవర్‌ఫుల్‌ ఉమెన్‌కు పర్‌ఫెక్ట్‌ ఉదాహరణగా నిలిచారామె. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే, ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారిలా..

దసరా అంటే మీకేం గుర్తొస్తుంది. మర్చిపోలేని సంఘటనలు ఉన్నాయా?
జీవిత: దసరా అంటే రావణదహనం చేస్తారని విన్నా, టీవీలో చూశా. కానీ, హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో రాజశేఖర్‌గారు స్వయంగా రావణదహనం చేయడం చూశా. చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. 

మిమ్మల్ని ‘జీవిత’ అని పిలవాలా..? ‘పద్మ’ అని పిలవాలా?
జీవిత: ఎలా పిలిచినా పర్వాలేదు. అయితే, పద్మ అనే పేరు మర్చిపోయాను. అలా పిలిస్తే బాగా అనిపిస్తుంది. ఇప్పుడు అందరికీ జీవితగానే నేను తెలుసు. 

మీ సొంతూరు ఏది?
జీవిత: నాన్నగారిది ద్రాక్షారామం. అమ్మది విజయవాడ. చుట్టాలంతా రాజమండ్రిలో ఉండేవారు.

మొదటిసారి ఏ సినిమా కోసం మీరు కెమెరా ముందు నిలబడ్డారు?
జీవిత: టి.రాజేందర్‌ దర్శకత్వంలో తమిళంలో మొదటి సినిమా చేశా.  ఆయన నళిని, అమలను కూడా వెండితెరకు పరిచయం చేశారు. వారి తర్వాత నేను. నాతో పాటు, జయచిత్ర సోదరుడు హీరోగా నటించాడు. తమిళంలో బాగా ఆడింది. తొలి సినిమా రాజేందర్‌ దర్శకత్వంలో చేయడంతో వరుస ఆఫర్లు వచ్చాయి. ఐదారు సినిమాలకు సంతకం చేశా. అలా  నా కెరీర్‌ తమిళంలోనే ప్రారంభమైంది. 18ఏళ్ల వయసులోనే నటించడం మొదలు పెట్టా. నా పేరు మార్చింది కూడా ఆయనే. ‘పద్మ’ అనే పేరు సాధారణంగా ఉంది. చాలా మందికి ఈ పేరు ఉంది. అందుకే నీ పేరు మారుస్తా’ అన్నారు. నేను ‘సరే సర్‌. ఏ పేరు పెడతారు’ అని అడిగా. ‘జీవిత’ అని చెప్పారు. నాకు కూడా బాగానే ఉందనిపించింది.

మరి తెలుగులో అవకాశం ఎలా వచ్చింది?
జీవిత: తమిళంలో ఆ సినిమా విడుదలైన తర్వాత నాకు మంచి పేరు వచ్చింది. ఒక సినీ మ్యాగజైన్‌ కవర్‌ పేజీ చూసి, తెలుగులో ‘తలంబ్రాలు’ కోసం ఎం.ఎస్‌.రెడ్డి గారు పిలిపించారు. నా వివరాలన్నీ అడిగారు. ‘తెలుగు బాగా చదువుతావా’ అన్నారు. ఒక డైలాగ్‌ పేపర్‌పై రాసిచ్చి చదివించారు కూడా. వెంటనే హీరోయిన్‌గా తీసుకున్నారు. 

హీరో ఎవరో అడిగారా?
జీవిత: అవును అడిగాను. ‘ఇందులో ప్రతినాయక ఛాయలున్న పాత్ర చాలా కీలకం. అది డాక్టర్‌ రాజశేఖర్‌ చేస్తున్నారు. కల్యాణ చక్రవర్తిది పాజిటివ్‌ పాత్ర’ అని చెప్పారు. అంతకుముందే రాజశేఖర్‌గారితో తమిళంలో ఒక సినిమా చేశా. రామరాజన్‌ దర్శకుడు. అందులో రాజశేఖర్‌గారిని నా భర్త పాత్రకు తీసుకున్నారు. మొదటి రోజు షూటింగ్‌కు వెళ్తే నాకు జలుబు, జ్వరం వచ్చాయి. ఆయనే వచ్చి నన్ను పరీక్షించి, మందులు కూడా రాసి ఇచ్చారు. ‘చాలా మంచివారిలా ఉన్నారు’ అని నేనూ, నా అసిస్టెంట్‌ అనుకున్నాం. ఆ రోజు షూటింగ్‌ సమయంలో దర్శకుడు అనుకున్న విధంగా రాజశేఖర్‌ చేయలేకపోయారు. మరుసటి రోజు ఆయన షూటింగ్‌ రాలేదు. మూడో రోజు రాజశేఖర్‌ స్థానంలో రాధారవి వచ్చారు. ‘ఆయనను ఎందుకు తీసేశారు’ అని నేను యూనిట్‌ను అడిగితే, ‘ఆ పాత్రకు కుదరడం లేదండీ’ అని సమాధానం చెప్పారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ‘తలంబ్రాలు’ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు రాజశేఖర్‌ అసలు విషయం చెప్పారు. ‘‘హీరోయిన్‌ ఎలా ఉంది’ అని దర్శకుడు రామరాజన్‌, నిర్మాత అడిగితే, ‘పర్వాలేదు కానీ, కొంచెం బెటర్‌ అయితే బాగుంటుంది’ అని నేను చెప్పా. దాంతో నాకు మరుసటి రోజు కారు పంపలేదు. ‘ఏం జరిగింది’ అని అడిగితే, ‘సారీ సర్‌. సినిమా నుంచి మిమ్మల్ని తీసేశాం’ అని చెప్పారు. నేను మిమ్మల్ని(జీవిత) తీసేయమంటే వాళ్లు నన్ను తీసేశారు’’ అని రాజశేఖర్ ఆ రోజు ఏం జరిగిందో చెప్పారు‌. అలా తమిళ సినిమాకు మొదలైన మా పరిచయం ‘తలంబ్రాలు’లో కలిసే అవకాశం వచ్చింది. 

‘నువ్వు హీరో అవుతావో.. విలన్‌ అవుతావో.. నీ ఇష్టం. కానీ, సినిమా అమ్మాయిని పెళ్లి చేసుకోకు’ అని వాళ్ల తల్లి చెప్పిన తర్వాత కూడా ఇంట్లో ఫైట్‌ చేసి మరీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారట. దీని వెనుక కథ ఏంటి?
జీవిత: ఇప్పుడున్న యువకులంతా తాము చాలా అడ్వాన్స్‌ అనుకుంటారు. కానీ, వాళ్లు ఎవరూ చేయని పనులు మేము చేశాం. (నవ్వులు) మీరు చెప్పింది నిజమే. అసలు ఆయనను నటించడానికే ఇంట్లో ఒప్పుకోలేదట. పంతం పట్టి ఇంట్లో ఒప్పించారు. అయితే, పెళ్లిమాత్రం ఇంట్లో చెప్పిన అమ్మాయినే చేసుకోమన్నారు. ఈ విషయాలన్నీ ‘తలంబ్రాలు’ షూటింగ్‌ సమయంలో చెప్పేవారు. అప్పట్లో ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. నాకు సంబంధించిన విషయాలను కూడా ఆయనకు చెప్పేదాన్ని. ‘సినిమాల్లో నటించే అమ్మాయిని నేను పెళ్లి చేసుకోనని నా తల్లికి మాటిచ్చా. కానీ, నీలాంటి అమ్మాయి అయితే, బాగుంటుందని ఫీలవుతున్నా’ అని అనేవారు. నాకు కూడా ఆయనంటే ఇష్టమే. నటిని చేసుకోనని ముందు చెప్పడంతో నా మనసులో ఉన్న మాటను ఆయనతో చెప్పలేదు. ‘తలంబ్రాలు’ విడుదలై పెద్ద హిట్టయింది. ఆ తర్వాత ‘ఆహుతి’, ‘అంకుశం’ సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. మా కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ హిట్‌. దీంతో మా మధ్య బంధం మరింత బలపడింది. పెళ్లి చేసుకోవడానికి మా ఇంట్లో అందరికీ ఇష్టమే. ఎందుకంటే మాది సాధారణ కుటుంబం. నాన్న హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌గా చేసి, రిటైర్‌ అయ్యారు. నేను నటిని కావడం కూడా యాదృచ్ఛికంగా జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే, టి.రాజేందర్‌  నన్ను చూసి ‘నటిస్తావా’ అని అడిగారు. ఈ విషయాన్ని మా స్కూల్లో చెబితే ఎవరూ నమ్మలేదు. ‘టి.రాజేందర్‌ అడగడం ఏంటీ? నువ్వు నటించనని చెప్పడం ఏంటీ? తప్పకుండా చేయాలి’ అని టీచర్లు అన్నారు. అప్పటిదాకా టి.రాజేందర్‌ అంత పెద్ద దర్శకుడని నాకు తెలియదు. ఏడాది తర్వాత ఆయన మా ఇంటికి వచ్చి ‘మీ అమ్మాయిని హీరోగా పెట్టి సినిమా తీస్తాం’ అని అడిగారు. ‘అమ్మాయికి ఇష్టమైతే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని ింట్లో వాళ్లు చెప్పారు. దాంతో ఆడిషన్స్‌ చేసి, సినిమా కోసం ఎంపిక చేశారు. ఇలా నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటనా షాకింగ్‌కు గురి చేసింది.

మీ కుటుంబంలో మొత్తం ఎంత మంది?
జీవిత: మేము మొత్తం నలుగురం. ఒక అక్క, అన్నయ్య, నేను, చెల్లి. రాజశేఖర్‌గారితో మా పెళ్లి గురించే ఇంట్లో చర్చ. ఆయనేమో ప్రతి ఇంటర్వ్యూలో ‘మా అమ్మ ఎవరిని చెబితే వారిని చేసుకుంటా’నని చెబుతున్నారు. దీంతో అమ్మ ఒక్కటే చెప్పారు. ‘మీకు ఇష్టం అయి పెళ్లి చేసుకుంటే ఒకే. లేదంటే నీ భవిష్యత్‌ ఏమవుతుంది’ అని అంటుండేవారు. మా నాన్నగారు కూడా ‘ఇవన్నీ అవసరమా’ అనేవారు. ఎవరెన్ని అనుకున్నా, మేమిద్దరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. ఎంతలా అంటే షూటింగ్‌లకు వెళ్తే, ఇద్దరి వేర్వేరు గదులున్నా  నేను ఆయన గదిలోనే ఉండేదాన్ని. 

రాజశేఖర్‌ను ఎందుకు ఫ్రాడ్‌ అని పిలిచేవారు?
జీవిత: ‘తలంబ్రాలు’ చిత్రంలో ఆయన పాత్ర అలాంటిదే కదా!  అందుకే అప్పటి నుంచి ఆయన్ను అలా పిలిచే దాన్ని(నవ్వులు) ‘మగాడు’ చిత్రీకరణలో ప్రమాదం జరగడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఊళ్లో లేరు. సర్జరీ అయిపోయిన తర్వాత వచ్చారు. అప్పటికే నేను ఆస్పత్రిలో ఉన్నా. వాళ్ల ముందు కూడా ఆయనను ‘ఫ్రాడ్‌.. ఫ్రాడ్‌’ అని పిలిచాను. ఆరోజు సాయంత్రం వాళ్లమ్మగారు నన్ను పిలిచి ‘అంతా బాగానే ఉంది. ఫ్రాడ్‌ ఏంటీ. సరిగ్గా పిలువు. నాకు నచ్చలేదు’ అన్నారు. దీంతో అప్పటి నుంచి ఆయనను ‘బంగారం’ అని పిలవడం మొదలు పెట్టా.


 

రాజశేఖర్‌కు శ్రీదేవి ఇంటి నుంచి పెళ్లి ప్రపోజల్‌ వస్తే, ఆ సంబంధం వద్దని మిమ్మల్ని చేసుకున్నారట నిజమేనా?
జీవిత: అది నిజమే. ఆయన డాక్టర్‌గా ఉండగా ఇది జరిగింది. సినిమాల్లో రాలేదు. శ్రీదేవి అప్పటికే నటిస్తున్నారు. వాళ్ల నాన్నగారు.. రాజశేఖర్‌గారి తండ్రి ఇద్దరూ క్లోజ్‌ ఫ్రెండ్స్‌. దీంతో పెళ్లి ప్రతిపాదన తెచ్చారు. శ్రీదేవి, శ్రీలేఖ ఎవరిని చేసుకున్నా పర్వాలేదని వాళ్ల ఇంట్లో అన్నారట. అయితే, అప్పటికే శ్రీదేవి నటి కావడంతో తన మనస్తత్వానికి సరిపోతుందో.. లేదోనని.. వద్దనుకున్నారట. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు ఆయన నన్ను కలిశారు.

‘మాతృదేవోభవ’ పెద్ద హిట్‌. ఎందుకు దాన్ని ఒప్పుకోలేదు?
జీవిత: నేను ఏపని చేసిన పర్‌ఫెక్ట్‌గా చేయాలని భావిస్తా. మరొకరు వేలెత్తి చూపించకూడదు. అప్పుడు రాజశేఖర్‌గారు చాలా బిజీ ఆర్టిస్ట్‌. మరోపక్క నేను కూడా నటిస్తే, ఆయన పనులను సరిగా చూసుకోలేనేమోనని అనుకున్నా. అనవసరంగా గొడవలు అవుతాయనిపించింది. దాంతో ఆ సినిమా ఆఫర్‌ను వదులుకున్నా. అంతే. అంతకుమించి ఏ కారణమూ లేదు. పైగా పెళ్లయిన తర్వాత నటించకూడదనే నియమం పెట్టుకున్నా. 1989లో ‘మగాడు’ నా చివరి చిత్రం. 1991లో మా వివాహం జరిగింది. 

మీ అన్నయ్య, అక్క, చెల్లి ఎక్కడ ఉన్నారు?
జీవిత: మా అక్క ఎప్పుడో చనిపోయారు. ఇటీవల మా అన్నయ్య కూడా కన్నుమూశారు.(కళ్లలో నీళ్లు..) ప్రస్తుతం నేను, మా చెల్లి మాత్రమే ఉన్నాం. ఆమె చెన్నైలో ఉన్నారు. అప్పుడప్పుడూ ఫోన్‌లో మాట్లాడుకుంటాం.

జీవిత లేకపోతే మూడు జీవితాలు ఉండవు.. ఆ పేర్లు చెబుతారా?
జీవిత: డాక్టర్‌ రాజశేఖర్‌.. శివాని.. శివాత్మిక.. 

బయట మీరూ రాజశేఖర్‌ చాలా క్లోజ్‌గా ఉంటారు. అయితే ఇంట్లో అలా ఉండరని బయట టాక్‌. మీరేమంటారు?
జీవిత: నేను మొదటిసారి వింటున్నా. ఈ విషయం నాకూ తెలియదు. రాజశేఖర్‌గారిని నచ్చని విషయం చేయమని పదికోట్ల రూపాయలు ఇచ్చినా ఆయన చేయరు. చాలా ఓపెన్‌హార్ట్‌. కొందరితో బేధాభిప్రాయాలు వచ్చినా ఆ కాసేపు అలా ఉంటారు. మళ్లీ ఏ ఫంక్షన్‌లో కనిపించినా, చాలా చక్కగా మాట్లాడతారు. చిరంజీవిగారితో మాకు ఇష్యూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత రాజశేఖర్‌గారు వెళ్లి ఆయనను కలిసి ‘గరుడవేగ’ చూడమని అడిగారు. ‘అప్పుడు చిరును తిట్టిన రాజశేఖర్‌ ఇప్పుడు వెళ్లి కలిశారేంటి? సినిమా సక్సెస్‌ కావాలని ఆయనను కలిశారా?’ అంటూ సోషల్‌మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేశాయి. ‘జీవితంలో ఎవరితోనూ శత్రుత్వం అనేది ఉండదు. కొన్ని సందర్భాల్లో కొందరు నచ్చుతారు. కొందరు నచ్చరు. అది అప్పటివరకే. సోషల్‌మీడియాలో వచ్చిన వాటి గురించి మర్చిపోండి. ఆ గొడవ తర్వాత మనం ఆయనని చాలా ఫంక్షన్స్‌లో కలిశాం. చక్కగా మాట్లాడుకున్నాం. చిరంజీవి సినిమా చూసి అభిప్రాయం చెబితే బాగుంటుందని అనుకున్నాం. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ల తర్వాత ఆ స్థాయి వ్యక్తి ఆయన. సోషల్‌మీడియా, వెబ్‌సైట్‌లలో రాసి వాటి గురించి పట్టించుకోకండి’ అని రాజశేఖర్‌ చెప్పారు. ఇదీ ఆయన మనస్తత్వం. ఇక రాజశేఖర్‌గారి జీవితంలో ఫ్రెండ్‌, ఫిలాసఫర్‌, అమ్మానాన్న, అక్కా, చెల్లి అన్నీ నేనే. వాళ్ల కుటుంబం అంతా చెన్నైలోనే ఉంటారు. ఆయనకు సంబంధించిన ఏ విషయమైనా నాతోనే చర్చిస్తారు. ప్రతి మనిషికీ కోపం అనేది ఉంటుంది. కాకపోతే ఆయనకు ఇంకాస్త ఎక్కువంతే. ‘ఇది ఇలా చేయండి’ అని నాలుగైదు సార్లు చెబుతారు. వినకపోతే అక్కడ ఎవరున్నా కోపం వస్తుంది. అప్పుడు వాళ్లను శిక్షించరు. తనని తాను శిక్షించుకుంటారు. రెండు రోజులు తినడం మానేస్తారు. మా ఇద్దరి మధ్య సఖ్యత లేదన్నవారిని మా ఇంటికి పంపండి. నెల రోజులు ఉండీ అన్నీ చూస్తారు. ఎవరికి నచ్చిన పద్ధతిలో వారు మాట్లాడుకోవడం కూడా పెద్ద ఫ్యాషన్‌ అయిపోయింది. పెద్ద పెద్ద కుటుంబాల్లో ఆడ పిల్లల గురించి రాయగలరా? మా గురించి ఎందుకు రాస్తారు? నేను అడిగేది కూడా ఇదే. దీని గురించి సీరియస్‌గా పనిచేస్తాం. రాజశేఖర్‌గారి గురించి, నా గురించి విన్నది కూడా ఫేక్‌. 

శివానీ నెలల బిడ్డగా ఉన్నప్పుడు రాజశేఖర్‌ గొడవ పడ్డారట!
జీవిత: శివాని ఫస్ట్‌ బేబీ కావడంతో ఆయనకు చాలా ఇష్టం. అప్పుడు దానికి రెండు నెలల వయసు. ఒకరోజు షూటింగ్‌ నుంచి ఇంటికి రాగానే రాజశేఖర్‌గారు శివానీని ఎత్తుకున్నారు. ఆయన ఎత్తుకోగానే అది ఒక్కసారిగా ఏడుపు అందుకుంది. మళ్లీ నాకు ఇస్తే ఏడవటం ఆపేసింది. అంతే, శివానీని తీసుకుని గదిలోకి వెళ్లి, ‘నేను ఎత్తుకుంటే ఎందుకు ఏడుస్తావ్‌’ అంటూ దానితో గొడవ పడ్డారు. ఆ విషయాన్ని ఇప్పటికీ తలుచుకుని నవ్వుకుంటారు. 

జీవిత సాఫ్టా.. రెబలా.. ఫైరా.. ఏమనుకోవాలి?
జీవిత: అన్నీ(నవ్వులు). సాధారణంగా నేను చాలా సాఫ్ట్‌. అదే సమయంలో పరిస్థితి చేయిదాటితే ఎదుట ఎవరున్నా చూడను. తప్పు నావైపు లేకపోతే అస్సలు ఊరుకోను. అదే సమయంలో నా వల్ల తప్పు జరిగితే మొదట వెళ్లి నేను సారీ చెబుతా. నేను కష్టపడితేనే కదా నా జీవితం. అలాంటిది నా జీవితాన్ని ఎవరో వేలెత్తి చూపితే ఎందుకు ఊరుకుంటాను. 

ప్రొడ్యూసర్‌గా మీ గురించి?
జీవిత: తొలి చిత్రం ‘మంచివారు మావారు’. ఏఎం రత్నంగారితో కలిసి తీశాం. పర్వాలేదు. బాగానే డబ్బులు వచ్చాయి.  ఆ తర్వాత ‘మగాడు’ సూపర్‌హిట్. దాని తర్వాత ‘శేషు’ నష్టాలేమీ రాలేదు. ‘ఆప్తుడు’, ‘సత్యమేవజయతే’ నష్టాలు తెచ్చిపెట్టాయి. నిర్మాతగా సంపాదించింది ఏదీ లేదు. అన్నీ పోగొట్టుకున్నవే. ఎందుకు నిర్మాతనయ్యానా? అని ఎప్పుడూ బాధపడలేదు. ఈ విషయంలో రాజశేఖర్‌గారు అప్పుడప్పుడూ బాధపడేవారు. నేను ధైర్యం చెబుతుండేదాన్ని.

జూబ్లీహిల్స్‌లో ఇంటిని ఎందుకు అమ్మేయాల్సి వచ్చింది?
జీవిత: ‘ఆప్తుడు’ డిజాస్టర్‌. చాలా అప్పులయ్యాయి. దాని కోసమే ఇల్లు అమ్మాల్సి వచ్చింది. చెన్నైలో ఉన్న ఆస్తులు అమ్మడానికి వీల్లేదని మా మామగారు చెప్పారు. దాంతో హైదరాబాద్‌లో ఉన్న ఇల్లు అమ్మేశాం. 

మీ ‘దొరసాని’ ఎలా ఉంది?
జీవిత: తను చాలా బాగుంది. పెద్ద పాప పేరు శివాని. తనని యాక్టర్‌గా చేద్దామనుకున్నాం. ప్రస్తుతం మెడిసన్‌ చేస్తోంది. చాలా సర్‌ప్రైజ్‌గా శివాత్మిక నటి అయింది. చాలా మంచి సినిమా. ఆత్మ సంతృప్తినిచ్చింది. తనకు సంబంధించిన దుస్తులన్నీ నేను డిజైన్‌ చేసినవే. 

మీకు శివాని ఇష్టమా.. శివాత్మిక ఇష్టమా..?
జీవిత: సాధారణంగా ప్రతి ఇంట్లో అక్కాచెల్లెళ్లు మధ్య గొడవ వస్తే, కొట్టుకుంటారు. అదే వాళ్ల మధ్యలోకి వేరే వాళ్లు వస్తే అస్సలు ఊరుకోరు. మా ఇంట్లో కూడా అంతే. వాళ్లు నా కూతుళ్లుగా పుట్టడం నా అదృష్టం. ‘ఇద్దరూ ఆడ పిల్లలా’ అని చాలా మంది అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇలా చాలా మంది ఇళ్లలో ఉన్నారు. అలాంటి వాళ్లకు నేను చెప్పదలచుకున్నది ఒక్కటే, ‘ఆడ పిల్లలు పుట్టడం అదృష్టం. మనం ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే మనకు ఆడపిల్లలు పుడతారు’ నా తల్లి చనిపోయిన తర్వాత ఆమె లేని లోటును వాళ్లు తీర్చారు. 

రాజశేఖర్‌కు ఆరోగ్యం బాగోలేదని, ‘ఆయన ఇక బతకడం కష్టం’ అని ఒక డాక్టర్‌ చెప్పారని విన్నాం! నిజమేనా?
జీవిత: బతకడం కష్టమనలేదు. ఆయన జీవితంలో రెండు విషయాలు జరిగాయి. రాజశేఖర్‌గారి తల్లిచనిపోయే ముందు ఆయనకు గుండెపోటు వచ్చింది. అంతకన్నా ముందు చెన్నైలో ఉంటే ఆయన విపరీతమైన కడుపునొప్పితో బాధపడ్డారు. సాధారణంగా ఏ సమస్య వచ్చినా, సొంతంగా వైద్యం చేసుకుంటారు. కానీ, తొలిసారి ఆస్పత్రికి వెళ్దామన్నారు. సరేనని తీసుకెళ్లాం. అన్ని టెస్టులు చేసిన తర్వాత ‘క్యాన్సర్‌లా అనిపిస్తోంది’ అన్నారు. ‘ఇంకో టెస్టు చేస్తే గానీ, అసలు అదేంటో తెలియదు. రిపోర్ట్‌ వచ్చేందుకు 24గంటలు పడుతుంది’ అని డాక్టర్లు చెప్పారు. అంతే ఆ 24గంటలు మాకో పీడకల. నేనూ శివాత్మిక ఏడుస్తూనే ఉన్నాం. కానీ, శివాని మాత్రం ధైర్యంగా ఉంది. టెస్టు రిజల్ట్‌ వచ్చిన తర్వాత వినడానికి కూడా మాకు ధైర్యం సరిపోలేదు. క్యాన్సర్‌ కాదని తెలిసిన తర్వాత  శివాని పరిగెత్తుకుంటూ వచ్చి ‘క్యాన్సర్‌ కాదట. డాక్టర్‌ ఏం పర్వాలేదన్నారు’ అని చెప్పి అప్పటివరకూ  దాచిపెట్టిన బాధను ఒక్కసారిగా వెళ్లగక్కింది. గంటసేపు ఏడ్చింది.  ఆ రోజును ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను.

సినిమా కథ వినిపించడానికి వస్తే, ‘మొదట జీవితకు వినిపించండి. తర్వాత నేను వింటా’ అని చెప్పడం వల్ల చాలా ఆఫర్లు పోయాయట. ఎంతవరకూ వాస్తవం?
జీవిత: ఇది పురుషాధిక్య సమాజం. ‘ఆడపెత్తనం ఏంటీ? జీవిత దగ్గరకు వెళ్లి కథ చెప్పడం ఏంటీ?’ అని అనుకున్న వాళ్లు ఎవరైనా అలా అని ఉండవచ్చు. శ్యాంప్రసాద్‌రెడ్డిగారు, పోకూరి బాబూరావుగారు మాతో ఐదారు సినిమాలు చేశారు. వాళ్లు ఎప్పుడూ ఇలా అనలేదు. రోజుకు 10మంది కథలు చెబుతామని వస్తారు. అందరు చెప్పిన కథలూ వినగలమా? ఏ నటుడైనా ఒక మేనేజర్‌ను పెట్టుకుంటాడు. అతను ‘ఇది బాగుంది. ఇది బాగోలేదు’ అని చెబుతాడు. నేను ఆ మేనేజర్‌ పనిచేస్తా. నేను ఆడదాన్ని కాబట్టి, రాజశేఖర్‌గారి భార్యను కాబట్టి మీకు సమస్య. మీరు అలా భావిస్తే.. నేను మిమ్మల్ని లెక్క చేయాల్సిన పనిలేదు. ఆడవాళ్లను గౌరవించేవాళ్లకు ఆ సమస్య ఉండదు. ‘గోరింటాకు’ సినిమా కోసం ఆయనను ఒప్పించడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. ఎందుకంటే అది నాకు బాగా నచ్చింది. తనకు సరిపోదేమోనని అనుకున్నారు. ఆయనను ఒప్పించడం చాలా కష్టం. 

మీరు దర్శకత్వం చేయగలరు! అని ఎవరు గుర్తించారు?
జీవిత: రాజశేఖర్‌గారే. తమిళంలో బాలాగారి దర్శకత్వంలో విక్రమ్‌ నటించిన ‘సేతు’ రైట్స్‌ మేము కొన్నాం. ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్‌ కూడా తాము చేస్తామని అన్నారు. అయితే, చాలా మార్పులు చెప్పారు. అందుకు రాజశేఖర్‌గారు ఒప్పుకోలేదు. ఇవన్నీ ఎందుకని నన్నే డైరెక్ట్‌ చేయమన్నారు. హరి అనుమోలుగారిని కెమెరామెన్‌గా పెట్టుకున్నాం. ఆయన చాలా హెల్ప్‌ చేశారు. 

టాలీవుడ్‌ ఉన్న హీరోలకు మీరు డబ్బింగ్‌ చెప్పాల్సి వస్తే ఎవరికి చెబుతారు?
జీవిత: పేర్లు చెప్పలేకపోతున్నా. నాకు కమల్‌హాసన్‌గారంటే ఇష్టం.

మీకు బాగా నచ్చిన డైలాగ్‌?
జీవిత: ‘తలంబ్రాలు’లో ‘మటాష్‌’ అని రాజశేఖర్‌గారంటే బాగుంటుంది. దీంతో పాటు మరో డైలాగ్‌ కూడా ఇష్టం. ‘ఆనాటి సీత నుంచి నేటి రాధిక వరకూ ఆడది ఆడదే. సెంటిమెంట్‌ మీ బలహీనత. దాన్ని వాడుకోవడం మా టాలెంట్‌’ అంటారు. ఇప్పటికీ సమాజంలో ఇదే నడుస్తోంది. 

రాజశేఖర్‌పై పుస్తకం రాస్తే ఏం పేరు పెడతారు?
జీవిత: బంగారం

మరిన్ని

బీసీసీఐలోకి ‘బాహుబలి’..వేయికళ్లతో వెయిటింగ్ [00:34]

భారత క్రికెట్‌కు నూతన జవసత్వాలు తీసుకొచ్చిన సౌరవ్‌ గంగూలీ.. మరికొద్ది రోజుల్లో ప్రపంచంలోనే అతి సంపన్న క్రికెట్‌ బోర్డుకు అధ్యక్షుడిగా నియమితులు కానున్నాడు. బీసీసీఐ పీఠంపైకి దాదా రాకకోసం ఆయన అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు.

సల్మాన్‌తో దిశా మరోసారి.. [00:30]

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌తో కలిసి ముద్దుగుమ్మ దిశా పటానీ మరోసారి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి ‘భారత్‌’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌....

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో తమిళిసై భేటీ [00:28]

దిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. గవర్నర్‌గా ఆమె పాల్గొన్న సమాజిక కార్యక్రమాలు, బతుకమ్మ సంబరాలపై...

ట్రంప్‌.. మమ్మల్ని నట్టేట్లో ముంచారు.. [00:38]

సిరియాలోని కుర్దులు మళ్లీ మోసపోయారు.2014 నుంచి సిరియా, ఇరాక్‌ దేశాల్లో ఇస్లామిక్‌స్టేట్‌ ఉగ్రవాదులపై వీరి చేయూతతోనే అమెరికా సారథ్యంలోని సంకీర్ణసేనలు విజయం సాధించాయి.

ఎంతో అవమానంగా ఫీలయ్యా: బెంగాల్‌ గవర్నర్‌ [00:38]

పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్కర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కోల్‌కతాలో జరిగిన దుర్గా పూజ కార్నివాల్‌లో తనకు తీవ్ర అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది తనను తీవ్ర ఆవేదనకు, కలతకు గురిచేసిందన్నారు........

బైక్‌పై సీఎం:ఒంటరిగా 122కి.మీ రైడ్‌ [00:38]

అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ వినూత్నంగా ఆకట్టుకున్నారు. తాజాగా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా స్వయంగా ఆయనే బైక్‌పై ఒంటరిగా 122 కిలోమీటర్లు ప్రయాణం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

విదేశీ ఖైదీల కోసం భారత వ్యాపారి ధాతృత్వం! [00:36]

వారంతా ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లి చిన్న చిన్న నేరాల్లో చిక్కుకుని జైలు పాలయ్యారు. సంవత్సరాల పాటు శిక్షను అనుభవించి, ప్రస్తుతం విడుదలై వారి సొంత దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఉగాండా, అఫ్గానిస్థాన్‌, నైజీరియా, చైనా, ఇథియోపియా దేశాలకు చెందిన వారు ఉన్నారు.

‘ఫ్లిప్‌కార్ట్‌ వీడియో..’ కంటెంట్‌ వివరాలివే.. [00:36]

అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ ఫ్లిక్స్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్‌ గత ఆగస్టులో ప్రారంభించిన ‘ఫ్లిప్‌కార్ట్‌ వీడియో ఒరిజినల్స్‌’కు సంబంధించిన వివరాలను ఆ సంస్థ మంగళవారం వెల్లడించింది. మధ్య, దిగువ స్థాయి పట్టణాల వినియోగదారులే లక్ష్యంగా తాము

గూగుల్‌ సరికొత్త ఉత్పత్తుల వివరాలివే... [00:36]

అంతర్జాల దిగ్గజం గూగుల్‌ సంస్థ మంగళవారం సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. పిక్సల్‌ 4, పిక్సల్‌ 4 ఎక్స్‌ఎల్‌, పిక్సల్‌బుక్‌ గో, పిక్సల్‌ బడ్స్‌ వంటి ఉత్పత్తులను విడుదల చేసింది. వీటి ఆవిష్కరణకు సంబంధించిన కార్యక్రమాన్ని ‘‘మేడ్‌ బై గూగుల్‌ '19’’ పేరుతో న్యూయార్క్‌లో నిర్వహించింది. గూగుల్‌ నుంచి రాబోతున్న ఉత్పత్తులపై కొన్ని నెలలుగా ఊహాగానాలు షికారు చేసిన నేపథ్యంలో తాజా

విద్యుత్తు వాహనాల తయారీని నిలిపిన హార్లీ [00:36]

విలాసవంతమైన బైకుల తయారీ సంస్థ హార్లీ డేవిడ్‌సన్‌ విద్యత్తు వాహనాల తయారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆ కంపెనీ ‘లైవ్‌వైర్‌’...