విరామం..విజయాన్ని ఆపలేదు

బడిలో గురువులు బోధించే పాఠాలు పసితనంపై ముద్రవేస్తాయి. తెలిసీ తెలియని వయసులోనే తమ లక్ష్యాన్ని బుర్రలో నాటేలా చేస్తాయి. అలా పొందిన స్ఫూర్తితో ఓ సాధారణ విద్యార్థిని... శాస్త్రవేత్తగా ఎదిగారు. పెళ్లి, పిల్లల బాధ్యతలతో పదేళ్లకాలం కరిగిపోయినా... తనలో సైన్స్‌పట్ల ఉన్న ఆసక్తిని దూరం చేసుకోలేదామె. ఆ సంకల్పబలమే...  ఉన్నత చదువులు... పరిశోధన వైపు అడుగులు వేసేందుకు బాటలు వేసింది.   సీనియర్‌ శాస్త్రవేత్తగా ఎదిగేలా చేసింది. ప్రతిష్ఠాత్మకమైన ఇన్ఫోసిస్‌ సైన్స్‌ పురస్కారం అందుకునేలా చేసింది. ఆమే సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్‌ మంజులారెడ్డి.
* పరిశోధనవైపు రావడానికి స్ఫూర్తి?
నేను బేగంపేటలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కళాశాలలో బీఎస్సీ చదివా. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బయో కమెస్ట్రీలో ఎంఎస్సీ చేశా. కాలేజీలో ఉన్నప్పుడే నాకు పరిశోధనలపై ఆసక్తి ఏర్పడింది. నేను బీఎస్సీ చదివిన కళాశాల, ఎంఎస్సీ పూర్తిచేసిన విశ్వవిద్యాలయం అధ్యాపకులే అందుకు స్ఫూర్తి.
* పదేళ్ల తరువాత మళ్లీ చదువు కష్టం కాలేదా?
ఇరవై ఏళ్లకే పెళ్లి కావడం, పిల్లల బాధ్యతతో పరిశోధనకు పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేనని కొంతకాలం ఆగాను. పిల్లలు కొంచెం పెద్దయ్యాక దాదాపు పదేళ్ల తరువాత 1996లో సీసీఎంబీలో పీహెచ్‌డీలో చేరా. అది 2001లో పూర్తైంది. అక్కడే శాస్త్రవేత్తగా చేరా. చాలా కాలం తరువాత తిరిగి చదువు కొనసాగించడం మాటలు కాదు కానీ... ఆసక్తి ఉంటే కష్టమేమి కాదు. పట్టుదల, ఓపికతో ఇబ్బందులను అధిగమించొచ్చు. ప్రతి మహిళ జీవితంలో పెళ్లి, పిల్లల బాధ్యతలు తప్పవు కానీ మనకు పట్టుదల ఉంటే ఇవేవి అడ్డంకి కావు. అమ్మానాన్న, మా వారి సహకారం ఎంతో ఉంది. పరిశోధనలరీత్యా విదేశాలకు వెళ్లినా పిల్లలను వారే చూసుకునేవారు.  
* సవాళ్లు ఎదుర్కొన్నారా?
సీసీఎంబీలో స్త్రీ, పురుషులను సమానంగానే చూసేవారు. ఒక మహిళగా నాకు ఏ రోజూ సమస్యలు ఎదురుకాలేదు. చిన్నచిన్న ఇబ్బందులు ఎక్కడైనా సహజమే. ప్రత్యేకంగా మహిళ కావడం వల్ల ఎలాంటి సమస్యలూ ఎదుర్కోలేదు.  
* మహిళలకు పరిశోధన రంగంలో అవకాశాలు?
పరిశోధన రంగంలో స్త్రీలకు పురుషులతో సమాన అవకాశాలే ఉన్నాయి. ఆడవాళ్లు కాబట్టి రిస్క్‌ తీసుకోకూడదు అనే ధోరణి  ఉండకూడదు. కానీ మహిళలే ధైర్యం చేయడం లేదు. చాలా సమయం కేటాయించాల్సి వస్తుంది గనుక కష్టమని తల్లిదండ్రులే వద్దని చెబుతున్నారు. పరిశోధన రంగంలోనే కాదు ఎక్కడ చూసినా సమస్యలు ఉంటాయి. ఓపిక ఉండాలి.
* పరిశోధనల పరంగా మన దేశం ఏ స్థాయిలో ఉంది?  
పదేళ్లుగా మనదేశంలో పరిశోధనలు పెరిగాయి. ఇందుకోసం విదేశాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. మా దగ్గరే వేర్వేరు అంశాల్లో ప్రపంచస్థాయి పరిశోధనలు జరుగుతున్నాయి.

* మీరు కణ గోడపైనే పరిశోధన చేయడానికి కారణం?
నేను సెల్‌వాల్‌ అంశంలోనే నైపుణయం సాధించా. అందుకే దీనిపై పరిశోధనలు చేస్తున్నా. మనదేశంలో బ్యాక్టీరియా సెల్‌పై పరిశోధనలు చాలామంది చేస్తున్నా సెల్‌వాల్‌పై చేస్తున్న అతికొద్ది మందిలో నేనూ ఉన్నా. నా పరిశోధనలను గుర్తించి ఇన్ఫోసిస్‌ ప్రైజ్‌కు ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. జనవరి 7న బెంగళూరులో జరిగే వేడుకలో అమర్త్యసేన్‌ చేతుల మీదుగా బంగారు పతకం, ప్రశంసా పత్రం అందజేస్తారు. నగదు పురస్కారమూ ఇస్తారు. ఇందులో కొంత మొత్తం సామాజిక కార్యక్రమాలకు కేటాయించాలనేది నా ఆలోచన.
* ఇప్పటితరం పరిశోధన వైపు రావడం లేదని అంటున్నారు?
ఇది కొంతవరకూ నిజమే. పరిశోధన సంస్థలు, ఉపాధి అవకాశాలు తక్కువ ఉండటం వల్లే ఆసక్తి చూపించడం లేదు. పైగా ఈ రంగంలో స్థిరపడేందుకు 30 నుంచి 32 ఏళ్లు పడతాయి. దాంతో వేగంగా స్థిరపడాలనే భావనతో ఇంజినీరింగ్‌లో చేరుతున్నారు. అయినప్పటికీ పరిశోధనలవైపు వచ్చేవారు పెరిగారు. ప్రతిభావంతులే వస్తున్నారు. ఫెలోషిప్‌లు పెరిగాయి.
* అమ్మాయిలకు మీరిచ్చే సలహా?
జీవితంలో ఏదైనా సాధించాలంటే క్రమశిక్షణ ముఖ్యం. ఆసక్తి ఉన్న రంగం ఎంచుకుని అంకితభావంతో పనిచేస్తే ఎందులోనైనా రాణిస్తారు. సమస్యలు వచ్చాయని ఏ పనినీ మధ్యలో వదిలేయకూడదు. సహనం ఉంటే దేన్నయినా సాధించడం కష్టమేమీ కాదు.
* కుటుంబం గురించి?
నాన్న ఫారెస్ట్‌ సర్వీసు.. డీఎఫ్‌వోగా రిటైర్‌ అయ్యారు. అమ్మ గృహిణి. మా వారు డాక్టర్‌ కృష్ణారెడ్డి కార్డియాలజిస్ట్‌. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దవాడు మెడికల్‌ డివైజెస్‌ సంస్థ నడుపుతున్నాడు. పెళ్లైంది. ఒక  బాబు. చిన్నవాడు ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేసి హార్వర్డ్‌లో పోస్ట్‌డాక్‌ చేస్తున్నాడు. సీసీఎంబీకి సమీపంలోనే హబ్సిగూడలో మా ఇల్లు. అమ్మానాన్న, నా కొడుకు, కోడలు, మనవడు అందరం కలిసే ఉంటాం.
- మల్లేపల్లి రమేశ్‌రెడ్డి, ఈనాడు హైదరాబాద్‌

మరిన్ని