కోల్‌కతా: తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ సింగ్ ధన్కర్ ఆ రాష్ట్ర మంత్రులకు హితవు పలికారు. కొన్నిరోజులుగా మమత ప్రభుత్వం, గవర్నర్‌కు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ దీనిపై మాట్లాడుతూ.. ‘‘ఇటీవల జూనియర్ హెల్త్ మినిస్టర్ చంద్రిమ భట్టాచార్య నా వ్యాఖ్యలపై స్పందించారని నేను విన్నా. ఆమెకు నేనొకటే చెబుతున్నా. నా వ్యాఖ్యలపై స్పందించటం మానేసి తన శాఖపై దృష్టి సారించాలి. రాష్ట్రంలో ఆరోగ్య శాఖ పరిస్థితి ఎలా ఉందనే విషయం అందరికీ తెలుసు. ఇక ముఖ్యమంత్రిపై నేను చేసే వ్యాఖ్యలపై ఆమె స్వయంగా స్పందించాలి. లేదంటే దాని కోసం ప్రత్యేక మంత్రినైనా నియమించాలి. మంత్రులందరూ తమ నాయకురాలిని మెప్పించటం కోసం నా వ్యాఖ్యలపై స్పందిచడం ఆపాలి’’ అని గవర్నర్ పేర్కొన్నారు.
ఇటీవల ముర్షీదాబాద్ జిల్లాలోని దొమ్కల్లో పాల్గొనేందుకు వెళ్లిన గవర్నర్‌కి కొందరు తృణమూల్ కార్యకర్తలు నల్లజెండాలు చూపిస్తూ నిరసన తెలిపారు. ఆ పర్యటనకు వెళ్లేందుకు ప్రభుత్వాన్ని హెలికాప్టర్ కోరగా.. అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని జగదీప్ తెలిపారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం నా కదలికలను నియంత్రించాలనుకొంటోంది. రాజ్యాంగ నిబంధనలకు లోబడే నేను నడచుకుంటున్నాను. నాకెవరూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు ’’ అని గవర్నర్ అన్నారు.
గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రి చంద్రిమ భట్టాచార్య స్పందిస్తూ ‘‘గవర్నర్ పదవి చేపట్టినప్పటి నుంచి ఆయన చేస్తున్న పనుల గురించి ఒక్కసారి ఆలోచించుకోవాలి. గవర్నర్ పదవికి అది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. రాష్ట్ర ప్రజలు గవర్నర్ పట్ల కోపంగా ఉన్నారు. వారే ఆయనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసుంటారు’’ అని అన్నారు.