శత్రుదుర్భేద్యమైతేనే... రక్షణ!

భారత సైన్యం పోరాట సామర్థ్యాన్ని పెంపొందింపజేయడానికంటూ విశ్రాంత లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ డీబీ షెకాత్కర్‌ సారథ్యంలోని కమిటీ క్రోడీకరించిన సిఫార్సుల అమలుకు దాదాపు రెండేళ్లక్రితమే కేంద్రం సుముఖత చాటింది. అధికారి క్యాడర్‌ పునర్‌ వ్యవస్థీకరణ, కీలక విభాగాధిపతులుగా యుక్తవయస్కుల నియామకం, రెవిన్యూ వ్యయ నియంత్రణ, బలగాల కుదింపు తదితరాలకు జనరల్‌ బిపిన్‌ రావత్‌ అధ్యక్షతన సైనిక కమాండర్ల సదస్సు నిరుడు అక్టోబరులోనే సమ్మతి తెలిపింది. ఇన్నాళ్లకు సైనిక ప్రధాన స్థావరంలో సిబ్బంది పునర్‌ వ్యవస్థీకరణతోపాటు ఇతరత్రా సర్దుబాట్లకు దాదాపు రంగం సిద్ధమైందంటున్నారు. పన్నెండున్నర లక్షల భూరి సైన్యంలో మిలిటరీ ఇంజినీర్‌ సర్వీసులు, సైనిక స్కూళ్ల సిబ్బంది, రాష్ట్రీయ రైఫిళ్ల దళం, వ్యూహాత్మక బలగాల కమాండ్‌(ఎస్‌ఎఫ్‌సీ) వంటివి అంతర్భాగం. ఆయా శ్రేణులకు చెందిన లక్షా 75వేల మందిలో 27వేలమంది వరకు తగ్గించడం ద్వారా ఖజానాకు రూ.1600కోట్ల మేర ఆదా కాగలదని అంచనా. వచ్చే ఆరేడేళ్లలో లక్షాయాభై వేలమందిని సైనిక విభాగాలనుంచి సాగనంపితే రెవిన్యూ వ్యయంలో ఏటా ఆరేడు వేలకోట్ల రూపాయల మిగులు సాధ్యపడుతుందంటున్నారు. వాస్తవానికి సుమారు 57వేల మంది అధికారులూ ఇతర సిబ్బందికి వివిధ బాధ్యతల అప్పగింత, బదలాయింపు, మిలిటరీ పాడి కేంద్రాలు వాహన ఆయుధ డిపోలు తదితరాలన్నింటా మార్పులు చేర్పులు 2019 డిసెంబరుకల్లా ఒక కొలిక్కి రాగలవని రక్షణమంత్రిగా అరుణ్‌ జైట్లీ 2017 ఆగస్టులో ప్రకటించారు. ఆ ప్రక్రియ రూపేణా అయిదేళ్లలో రూ.25వేలకోట్ల మేర రక్షణ వ్యయం ఆదా కాగలదనీ నాడాయన మదింపు వేశారు. అప్పట్లో సూచించిన గడువు, లెక్కల్లో ఇప్పుడు భారీ అంతరం ప్రస్ఫుటమవుతోంది. రక్షణ వ్యయం పద్దుకింద మిగులు తరవాతి సంగతి, ప్రతిపాదిత మార్పులద్వారా సైనిక పోరాట పటిమ ఏ మేరకు ఎలా ఇనుమడిస్తుందన్నదే- జాతిజనుల మెదళ్లలో సుడులు తిరుగుతున్న ప్రశ్న! 
దేశ సరిహద్దుల్ని కంటికి రెప్పలా కాపాడి, సార్వభౌమాధికార పరిరక్షణను అసిధారావ్రతంలా నిర్వర్తించాల్సిన అత్యంత కీలక వ్యవస్థ- సైన్యం. బలగాల సమరశీలత, కార్యకుశలతల్ని పెంపొందించే కార్యాచరణలకు పదును పెట్టడంపై భారత సైన్యం నాలుగు అంతర్గత అధ్యయనాలు నిర్వహింపజేసింది. జవాన్ల సర్వీసును అయిదేళ్లపాటు పొడిగించాలని, త్వరితగతిన పదోన్నతులకు వీలుగా బ్రిగేడియర్‌ ర్యాంకును తొలగించాలన్న ప్రతిపాదనలు అలా వెలుగు చూసినవే. ఆ బాణీకి అనుగుణంగానే 229మంది అధికారుల బాధ్యతల్లో మార్పులు, మిలిటరీ ఆపరేషన్ల నిమిత్తం డిప్యూటీ చీఫ్‌ పదవి సృష్టి, నిఘా- వ్యూహాత్మక ప్రణాళికల్లో సంస్కరణలు త్వరలో పట్టాలకు ఎక్కనున్నాయంటున్నారు. నాణేనికి అవతలి వైపునూ చూడాలి. ఈ ఏడాది జనవరి మొదటికి ఆర్మీలో 45వేలకు పైగా ఖాళీలు పోగుపడి ఉన్నాయని, అందులో లెఫ్ట్‌నెంట్‌ హోదాకు పైబడిన కొలువులే 7,400 వరకు ఉన్నట్లు రక్షణ శాఖామాత్యులు రాజ్‌నాథ్‌ సింగ్‌ రాజ్యసభాముఖంగా ప్రకటించారు. పాడి కేంద్రాల కోసం ఉపయోగిస్తున్న సైనిక క్షేత్రాల్ని శిక్షణకు, కార్యదళాలకు ఉపయుక్తమయ్యేలా తీర్చిదిద్దాలన్న సూచనలు మూడు దశాబ్దాలుగా అమలుకు నోచక పడిఉన్నాయి. ఆ మధ్య కొత్తగా ఎనిమిది లక్షల రైఫిళ్ల కొనుగోలుకు సైన్యం ప్రతిపాదించినా ‘నిధుల కొరత’ మూలాన రెండున్నర లక్షలే కొనదలచడం కలకలం రేపింది. రక్షణకు సంబంధించి ఎంతైనా వెచ్చిస్తామని, సత్వరం ఏమైనా చేస్తామన్న ఉదార ప్రకటనలకు వాస్తవిక కార్యాచరణకు మధ్య పేరుకుంటున్న అంతరం సైన్యాన్ని పరిమితుల చట్రంలో ఇరికిస్తోంది. మెరుగుదలను లక్షించి చేపట్టదలచామంటున్న సర్దుబాట్లు, బదలాయింపులు, సిబ్బంది తగ్గింపు తదితరాలు ఏవైనా అంతిమంగా సైన్యం పరిపుష్టీకరణకు దోహదపడేలా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకోవాల్సి ఉంది. 
సైన్యం నిర్వహింపజేసిన నాలుగు అంతర్గత అధ్యయనాలు భిన్నాంశాల్ని స్పృశించాయి. భారత సైన్యాన్ని సహేతుక స్థాయికి కుదించి పునర్‌ వ్యవస్థీకరించడం ఎలాగన్నదానిపై ఒకటి, ఏ విధంగా సైనిక ప్రధాన స్థావరాన్ని పునరుత్తేజితం చేయాలన్నదానిపై ఇంకొకటి, అధికారుల ర్యాంకుల సమీక్షపై మరొకటి, శ్రేణుల్లో స్ఫూర్తి రగిలించడంపై మరొకటి... లోతైన పథనిర్దేశం చేశాయి. పొంచిఉన్న యుద్ధభీతి, ఇతరులతో పోలిస్తే భారత సమర సన్నద్ధత లోగుట్టుమట్లను ఉపేక్షించి సైనిక సంస్కరణల్ని ఉరకలెత్తించే వీల్లేదు. యుద్ధనౌకలు, జలాంతర్గాములు, హెలికాప్టర్లు, రాడార్ల కొరత కారణంగా భారత సన్నద్ధత వెలాతెలాపోతున్నట్లు రక్షణపై జపాన్‌ శ్వేతపత్రం లోగడ సూటిగా ఆక్షేపించింది. చైనా, పాకిస్థాన్‌ పక్కలో జంటబల్లేల్లా ఉండగా దళాల శక్తిసామర్థ్యాల పెంపు, నవీకరణల్లో జాప్యం తీవ్ర అనర్థదాయకం. రోజువారీ నిర్వహణ వ్యయాలు, జీతభత్యాలకే సైన్యం కేటాయింపుల్లో 83 శాతం ఆవిరైపోతున్నాయి. రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) కింద యాభైకి మించి ప్రయోగశాలలు దేశంలో నెలకొన్నా, ఆయుధాలు పరికరాలు విడిభాగాలకు సంబంధించి పరాధీనత అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. అరకొర రక్షణ నిధుల్ని ఉన్నంతలో మెరుగ్గా వినియోగించుకోవడానికే ‘పునర్‌ వ్యవస్థీకరణ’ పరిమితమైతే మిగిలేది వృథాయాసమే! ఇండియాకన్నా మూడింతలకు పైగా కేటాయింపులతో, పరిశోధన అభివృద్ధికి భారీ వ్యయీకరణతో స్వీయరక్షణను చైనా శత్రుదుర్భేద్యంగా రాటుతేలుస్తోంది. భారత సైన్యాన్ని కుంగదీస్తున్న యాభై రకాల సమస్యల్ని ‘ఆర్మీ డిజైన్‌ బ్యూరో’ రెండేళ్ల క్రితమే ప్రత్యేక నివేదికలో గుదిగుచ్చింది. సంస్థాగత సంస్కరణలు, ఆధునికీకరణ వ్యూహాల్ని జమిలిగా అమలుపరచిన విదేశాల అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్వడం భారత్‌కు అన్నిందాలా శ్రేయోదాయకం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల దన్నుతో సైనికశక్తిని పరిపుష్టీకరించుకోవడమే దీర్ఘకాలిక రక్షణకు దోహదపడుతుందన్నది అక్షరసత్యం!

మరిన్ని