తల పగలగొట్టారు.. కొబ్బరిచెట్లు నరికేశారు

తెదేపా అధినేత చంద్రబాబుతో వైకాపా బాధితులు

ఈనాడు డిజిటల్‌, గుంటూరు: రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన వైకాపా బాధితులతో తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మంగళవారం భేటీ అయ్యారు. ‘‘25 ఏళ్లుగా మా స్వాధీనంలో ఉన్న భూమిని లాక్కున్నారు. కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవిని అడ్డం పెట్టుకుని జక్కంపూడి రాజా బెదిరిస్తున్నారు. 1994లో కొనుక్కున్న ఎకరం 70 సెంట్ల భూమిని కబ్జాచేశారు. దీనిపై మీకు ఫిర్యాదుచేశామనే అక్కసుతో ఆ స్థలంలోని కొబ్బరిచెట్లను నరికేశారు. అక్రమకేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. మహిళలను రోడ్డుకీడ్చి పేదల ఉసురు పోసుకుంటున్నారు’’ అని తూర్పుగోదావరి జిల్లా విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన చెల్ల్లుబోయిన విజయలక్ష్మి, నాగమల్లీశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘మూగవాళ్లని కూడా దయలేకుండా తల పగలగొట్టారు. 14 కుట్లు పడ్డాయి. వారికి అడ్డం పడ్డానని వృద్ధురాలినని కూడా చూడకుండా నన్ను దారుణంగా కొట్టారు. ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోలేదు. మీ దగ్గరకు వస్తున్నామని తెలిసి పోలీసులు స్టేషన్‌కు రమ్మని ఫోన్లు చేస్తున్నారు’’ అని పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం మైలసముద్రానికి చెందిన కిలారి మారుతి, దారపనేని మంగమ్మ చంద్రబాబుకు చెప్పారు. ‘‘18 ఎకరాల్లో 5400 దానిమ్మ చెట్లను నరికేశారు. పొలాలు నాశనం చేస్తే పార్టీలోకి వస్తారని వైకాపా నాయకులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములు లాక్కున్నారు’’ అని బాధితులు ఆదిమూర్తి, ఆవులప్ప వాపోయారు. వీరి బాధలను విన్న తర్వాత స్పందించిన చంద్రబాబు వైకాపా దుర్మార్గాలను సహించే ప్రసక్తే లేదని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

మరిన్ని