500 మెగావాట్లకు టెండర్లు

 రెండు నెలల పాటు విద్యుత్‌  కొనేందుకు డిస్కంల ఏర్పాట్లు
 జల విద్యుదుత్పత్తిలో జెన్‌కో రికార్డు

ఈనాడు, హైదరాబాద్‌: డిమాండ్‌ పెరగడంతో అదనంగా 500 మెగావాట్ల కొనుగోలుకు తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు టెండర్లు పిలిచాయి. ఈ నెల 15 నుంచి నవంబరు 15 వరకూ రెండు నెలలపాటు విద్యుత్‌ కొనుగోలు చేస్తామని స్పష్టంచేశాయి. ఈ మేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) టెండరు ప్రకటన జారీ చేసింది. ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయ బోర్లకు కరెంటు వినియోగం అధికంగా ఉన్నందున అదనంగా కొనుగోలు చేయాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. జాతీయ విద్యుత్‌ కొనుగోలు పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టెండర్లను ఆహ్వానించింది. బుధవారం టెండర్లను తెరుస్తామని ప్రకటించింది. మంగళవారం రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ 9,603 మెగావాట్లుంది. గతేడాది ఇదే రోజున 10,569 మెగావాట్లు ఉండటం గమనార్హం. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో వర్షాలు పడుతున్నందున వ్యవసాయ డిమాండ్‌ కొంతమేర తగ్గింది.
రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా జల విద్యుదుత్పత్తితో జెన్‌కో రికార్డు సృష్టించింది. ఈ నెల 9న 48.90 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. కృష్ణానదిలో అధికంగా వరద వస్తున్నందున ఇది సాధ్యమైంది. ఈ నదిపై జూరాల నుంచి పులిచింతల వరకూ గల ఆనకట్టలపై మొత్తం 32 జలవిద్యుత్‌ యూనిట్లు ఉన్నాయి. ఒకేరోజు వీటన్నింటిలో విద్యుదుత్పత్తి చేయడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారిగా ఈ నెల 9న సాధ్యమైంది.


తెలంగాణ విద్యుత్‌ రంగానికి కేంద్ర మంత్రి ప్రశంస

తెలంగాణలో విద్యుత్‌ రంగం పనితీరు బాగుందని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ ప్రశంసించారు. ‘‘కేంద్ర మంత్రి హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా డిస్కంల సీఎండీలతో వెళ్లి ఆయనను కలిశాం. రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా తీరును అడిగి తెలుసుకున్న ఆయన ఇతర రాష్ట్రాలకన్నా తెలంగాణలో చాలా మెరుగ్గా ఉందని చెప్పారు. మరోసారి రాష్ట్రానికి వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తానని చెప్పారు’’ అని ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు.

మరిన్ని