ప్రతి పట్టణాన్నీ సందర్శిస్తా

ఉపాధినిచ్చే పరిశ్రమలను స్థాపించి మాంద్యాన్ని ఎదుర్కొంటాం
పారిశ్రామిక రంగానికి ఊతం
ఆహారశుద్ధి పరిశ్రమలకు పెద్దపీట
పార్టీ సైనికులకు అవకాశాలు పుష్కలం
సంస్థాగతంగా తెరాసను బలోపేతం చేస్తాం
‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖిలో పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌

మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు పదవులు రాని వారిలో కొంత అసంతృప్తి సహజం. ఇదంతా పార్టీ అంతర్గత వ్యవహారం. అంతా సర్దుకుంటుంది. పదవుల విషయమై ఎవరూ ఆందోళన చెందవద్దు. వేల సంఖ్యలో అవకాశాలున్నాయి. కష్టపడి, పనిచేసే వారికి, పార్టీ ప్రగతికి కృషి చేసే వారికి సీఎం కేసీఆర్‌ తప్పకుండా అవకాశం కల్పిస్తారు.

•••••

 హైదరాబాద్‌ను పూర్తిస్థాయిలో స్వచ్ఛంగా మార్చడానికి వీలుగా కాలుష్య పరిశ్రమలను శివారు ప్రాంతాలకు తరలిస్తాం. ఇప్పటికే అమల్లో ఉన్న పారిశ్రామిక విధానాలకు తోడు అవసరమయితే కొత్త విధానం తెస్తాం. 

-కేటీఆర్‌ 

ఆర్థిక మాంద్యాన్ని సమర్థంగా ఎదుర్కొని తెలంగాణను ప్రగతిపథంలో నడిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. ముఖ్యమంత్రి తనకు అప్పగించిన శాఖల్లో పురపాలనకు ప్రాధాన్యమిచ్చి శక్తివంచన లేకుండా పనిచేస్తానని, పరిశ్రమలు, ఐటీ శాఖను కొత్త పంథాలో నడిపిస్తానని చెప్పారు. ప్రతీ నగరాన్ని, పట్టణాన్ని సందర్శిస్తానన్నారు. పారిశ్రామిక రంగంపై మాంద్యం ప్రభావం ఉన్నా.. తగిన కార్యాచరణతో కొత్త పరిశ్రమలను సాధిస్తామని, అవసరమైతే దేశవిదేశాల్లో పర్యటిస్తానని చెప్పారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షునిగా, మంత్రిగా పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నానని చెప్పారు. కీలకమైన పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం ఆయన ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు.

? పరిశ్రమలు, ఐటీకి ఎలాంటి మార్గనిర్దేశం చేస్తారు?
రాష్ట్రం ఏర్పడిన తర్వాత గొప్ప పారిశ్రామిక విధానం, టీఎస్‌ ఐపాస్‌ తెచ్చాం. వాటి ద్వారా పెద్దఎత్తున పరిశ్రమలు వచ్చాయి. ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలు తమ ప్రాంగణాలను ఏర్పాటు చేశాయి. ఔషధ, వైమానిక రంగాల్లో ఉత్తమ స్థానంలో ఉన్నాం. జినోమ్‌ వ్యాలీలో ఔషధ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఐటీ ఎగుమతులు రూ. లక్ష కోట్లకు చేరాయి. గత వారంలో అమెజాన్‌ ప్రాంగణం,  ఒప్పో, వన్‌ప్లన్‌ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ప్రారంభం కావడం తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రతీక. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉంది. ఇది పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పుడు ఉపాధి ఆధారిత ఉత్పాదక పరిశ్రమలు కీలకం. వాటిని ప్రోత్సహిస్తాం. ఐటీ పరిశ్రమలకు అన్ని విధాలా ఊతమిచ్చి బెంగళూరు స్థాయికి చేరతాం. వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ వంటి నగరాలు, పట్టణాలకు సైతం ఐటీని విస్తరిస్తాం. కాళేశ్వరం నీటి వల్ల వ్యవసాయ ఉత్పత్తులు పెద్దఎత్తున పెరుగుతాయి. వాటితో ఆహారశుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు సీఎం యోచిస్తున్నారు. దీనికి అనుగుణంగా కార్యాచరణ చేపడతాం.

? గతంలో నిర్వహించిన శాఖలనే మళ్లీ చేపడుతున్నారు.. కొత్త ప్రణాళికలేమైనా ఉన్నాయా?
పాత శాఖలే కావడంతో అవగాహనపరంగా సమస్యలు లేవు. మంచి అధికారులున్నారు. కొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతాను. ప్రధానంగా ఈసారి పురపాలనపై ఎక్కువ దృష్టి పెడతాను. ప్రస్తుత పరిస్థితులు, ప్రజావసరాల దృష్ట్యా పురపాలక ప్రగతి అత్యవసరంగా మారింది. పురపాలన ప్రజల జీవితాలతో ముడిపడింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత ఆశయాలతో కొత్త పురపాలక చట్టం తెచ్చారు. అవినీతిరహిత, పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలనకు ఇది ఉపకరిస్తుంది. జీహెచ్‌ఎంసీని ప్రక్షాళన చేస్తాం. బస్తీ పర్యటనలు, టౌన్‌హాలు సమావేశాలు కొనసాగుతాయి. అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలను సందర్శిస్తాను. హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ, స్కైవేల నిర్మాణం జరగాలి. ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రావాలి. పురపాలనలో ప్రజల భాగస్వామ్యం దిశగా వారిని చైతన్యపరుస్తా. నూతన సాంకేతిక విధానాలు, సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటాం.

? ఔషధనగరి, నిమ్జ్‌, మెగా జౌళి పార్కు, బుద్వేలు ఐటీ పార్కు పరిస్థితి ఏమిటి
వీటి సత్వర నిర్మాణానికి కృషి చేస్తాం. ఔషధ నగరికి భూసేకరణ పూర్తయింది. నిమ్జ్‌కు కార్యాచరణ సిద్ధంగా ఉంది. వరంగల్‌ మెగా జౌళి పార్కు, సిరిసిల్ల అపరెల్‌ పార్కుల పనులు సాగుతాయి. టీహబ్‌ రెండోదశ సిద్ధమవుతోంది. ఇప్పటికే సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ పరిశ్రమను పునరుద్ధరించాం. బీమా సిమెంటు, రామగుండం ఎరువుల కర్మాగారం, రేయాన్స్‌ అదే దారిలో ఉన్నాయి.

? చేనేత, జౌళి శాఖకు ఎలాంటి సహకారం అందిస్తారు
చేనేత, జౌళి శాఖను అన్ని విధాలా అభివృద్ధి చేశాం. నేతన్నలకు ఉపాధి, ఆదాయపరంగా భరోసా కల్పించాం. కొత్త పార్కుల నిర్మాణాలను పూర్తి చేస్తాం. మరింతమందికి ఉపాధిని కల్పిస్తాం. ప్రతీ సోమవారం చేనేత దుస్తులు ధరించాలని మరోసారి అందరికీ విన్నవిస్తున్నాను.

? పార్టీపరంగా ఎలాంటి లక్ష్యాలున్నాయి?
పురపాలక ఎన్నికలు మా ముందున్న ప్రధాన లక్ష్యం, దీనికి శ్రేణులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేస్తాం. పార్టీ సభ్యత్వ నమోదు ముగిసింది. కమిటీలు ఏర్పాటయ్యాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఎంపీ, జడ్పీ, ఎంపీపీ, పంచాయతీ ఎన్నికలు ఎదుర్కొన్నాను. సభ్యత్వ నమోదు 60 లక్షల మేరకు జరిగింది. ఇప్పుడు ప్రభుత్వంలోనూ భాగస్వామినయ్యే అవకాశం వచ్చింది. రెండు పదవులనూ సమర్థంగా నిర్వహిస్తాను.

- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని