ఇసుక కొరత తీరేవరకు రూ.10 వేలు ఇవ్వాలి

కార్మికులను ఆదుకోవాలి: కన్నా
విజయవాడలో భాజపా భిక్షాటన

గవర్నర్‌పేట (విజయవాడ), న్యూస్‌టుడే: ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారికి నెలకు రూ.10 వేలు చొప్పున ఇవ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండు చేశారు. ఇసుక కొరతను నిరసిస్తూ సోమవారం విజయవాడ లెనిన్‌ కూడలిలో భాజపా ఆధ్వర్యంలో భిక్షాటన నిర్వహించారు. దీనికి కన్నా లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడారు. ప్రభుత్వ నూతన ఇసుక విధానం లోపభూయిష్టంగా ఉందని విమర్శించారు. జగన్‌ తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు వరద పేరు చెబుతున్నారన్నారు. కార్మికులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం సిగ్గుచేటన్నారు.
  ఇసుక కొరతను నిరసిస్తూ కార్మికులు ఖాళీ గమేళాలతో ప్రదర్శన  చేశారు. లెనిన్‌ కూడలి నుంచి ప్రారంభమైన భిక్షాటన.. బీసెంట్‌రోడ్డు, రాఘవయ్యపార్కు వరకు సాగింది. భిక్షాటనలో లభ్యమైన సొమ్మును భవన నిర్మాణ కార్మికుల సంఘానికి అందించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, తురగా నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని