ఆర్టీసీ బస్సులు మూడు భాగాలు

50 శాతం ఆర్టీసీ సొంతానివి
30 శాతం అద్దె ప్రాతిపదికన..
20 శాతం ప్రైవేటుకు అనుమతి

2,100 ప్రైవేటు బస్సులకు అనుమతి
స్టేజ్‌ క్యారియర్లుగా తిరుగుతాయి
ఆర్టీసీతో సమానంగా ఛార్జీలు
సంస్థను పూర్తిగా ప్రైవేటీకరించం
సర్కారు సబ్సిడీలు యథాతథం
సంఘాల దురహంకారం వల్లే సమ్మె
ఇక ఆర్టీసీలో యూనియన్లు ఉండవు
సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
ఈనాడు - హైదరాబాద్‌

మేం ఎవరినీ తొలగించలేదు.. వారే సెల్ఫ్‌ డిస్మిస్‌ అయ్యారు

సంఘాలు సమ్మె ఉద్ధృతం చేస్తామనడం హాస్యాస్పదం. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం దృష్టిలో ఇప్పుడు ఆ సంస్థలో మిగిలిన సిబ్బంది 1200 మంది మాత్రమే. మిగతావారిని ఉద్యోగాల్లోంచి తొలగించాల్సిన (డిస్మిస్‌) అవసరం ప్రభుత్వానికి లేనేలేదు. గడువులోపు విధుల్లో చేరకపోవడంతో వారంతట వారు తొలగిపోయినట్లే. ప్రభుత్వ, ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తికి వారు స్పందించలేదు. తొలగిపోయినవారు డిపోల దగ్గర కానీ, బస్‌ స్టేషన్ల దగ్గర కానీ గొడవ చేయకుండా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయమని డీజీపీని ఆదేశించాం.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌

తెలంగాణలో కొత్తగా 2,100 ప్రైవేటు బస్సులను అనుమతించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. మొత్తం బస్సు సర్వీసులను మూడు భాగాలుగా విభజించి నడపాలని నిర్ణయించారు. వాటిలో ఆర్టీసీ సొంతబస్సులు 50 శాతం, అద్దెబస్సులు 30 శాతం కాగా మిగిలిన 20 శాతం ప్రైవేటు బస్సులు. ప్రైవేటు బస్సులకు స్టేజ్‌ క్యారియర్లుగా అనుమతివ్వాలని, వాటిని నగరంతో పాటు ఇతర రూట్లలో నడపాలని పేర్కొన్నారు. అవి పల్లెవెలుగు సర్వీసు కూడా చేయాలని నిర్ణయించారు. వాటి ఛార్జీలు ఆర్టీసీతో సమానంగా సంస్థ నియంత్రణలోనే ఉంటాయని వెల్లడించారు. ఆర్టీసీ పెంచినప్పుడే వాళ్లు ఛార్జీలు పెంచాలని, స్వల్పంగా పెంచడానికి కూడా ఆర్టీసీ కమిటీ నిర్ణయం మేరకే జరగాలని తెలిపారు. ఆర్టీసీ పూర్తి ప్రైవేటీకరణ ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టం లేదని, అలా చేయడం వివేకమైన చర్య కాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టంచేశారు. ఆ సంస్థ ఉండి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలగకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయం అనీ, ఆ మేరకే ఆర్టీసీని పటిష్ఠపరచడానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. క్రమశిక్షణను తుచ తప్పకుండా అమలు చేసి లాభాల బాటలో నడిపించడమే తమ ధ్యేయమని చెప్పారు. ఆర్టీసీ ప్రక్షాళనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు ప్రశంసిస్తున్నారని తెలిపారు. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ ఆధ్వర్యంలోని కమిటీ ఆర్టీసీకి సంబంధించిన ప్రతిపాదనలను తయారు చేసి సోమవారం సీఎంకు అందజేశారు. ఆ ప్రతిపాదనలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్షలో చర్చించారు. మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, రవాణాశాఖ కమిషనర్‌ సందీప్‌ సుల్తానియా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.

ప్రస్తుతం ఆర్టీసీలో 10,400 బస్సులున్నాయి. భవిష్యత్తులో వీటిని మూడు భాగాలుగా విభజించి నడపాలి. 50% బస్సులు అంటే 5,200 పూర్తిగా ఆర్టీసీవి.
మరో 30% అంటే 3,100 బస్సులు అద్దెవి. వాటిని ఆర్టీసీ పర్యవేక్షణలోనే నడుపుతారు. అవి ఆర్టీసీ డిపోలలోనే ఉంటాయి. ఇప్పటికే 21% అద్దెబస్సులను ఆర్టీసీ నడుపుతోంది. మరో 9% అద్దెకు తీసుకోవలసి ఉంది. వాటి ద్వారా సంస్థకు కొత్తబస్సులు వచ్చినట్లే. మిగిలిన 20% అంటే 2,100 బస్సులు పూర్తిగా ప్రైవేటువి.

పాస్‌లు కొనసాగుతాయి
విద్యార్థులు, దివ్యాంగులు, స్వాతంత్య్ర సమరయోధులు, పాత్రికేయులు, పోలీసు అమరవీరుల కుటుంబాల వారు, ఉద్యోగులు తదితరుల సబ్సిడీ బస్‌పాస్‌లు ఇక ముందూ కొనసాగుతాయి. సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. కావాల్సిన నిధులు బడ్జెట్లో కేటాయిస్తాం

సంఘాల అతి ప్రవర్తన వల్లనే
ఈ చర్యలు చేపట్టడానికి ప్రధాన కారణం సంఘాల అతిప్రవర్తనే. వారు ఎక్కిన చెట్టు కొమ్మను వారే నరుక్కున్నారు. తెదేపా, కాంగ్రెస్‌ ప్రభుత్వాలలో సమ్మె చేసిన సంఘాలు తెరాస ప్రభుత్వంలో కూడా సమ్మెకు దిగాయి. ప్రభుత్వంలో ఉన్నా వీళ్ల అతిప్రవర్తనలో మార్పు లేదు. పకడ్బందీ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ యజమాన్యాలకు ఇవ్వరు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయం. 40 ఏళ్లుగా జరుగుతున్న దాష్టీకం వల్ల ఇప్పుడు ఇదంతా చేయాల్సి వచ్చింది.

సమ్మె దురహంకారమే
సమ్మెకు పోవడానికి సంఘాల ఆధిపత్య భావనే కారణం. ఇష్టం వచ్చినట్లు సమ్మె చేస్తామనడం దురహంకారమే. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థల్లో ఏదైనా ప్రభుత్వ అనుమతితోనే జరగాలి. విధుల్లోకి రానివారిని ఆర్టీసీ సిబ్బందిగా పరిగణించనప్పుడు ఇక సంఘాల ప్రసక్తే లేదు. సంఘాలు వాటి అస్తిత్వాన్ని కోల్పోయాయి. భవిష్యత్‌లో ఇక ఆర్టీసీలో యూనియన్లు ఉండవు.

అద్భుత సంస్థగా రూపుదిద్దుకోవాలి
భవిష్యత్‌లో ఆర్టీసీ ఒక అద్భుతమైన సంస్థగా రూపు దిద్దుకోవాలి. లాభాలు వచ్చి కార్మికులకు (కొత్తగా చేరేవారికి) బోనస్‌ ఇచ్చే పరిస్థితికి రావాలి. ఆదాయం పెరగాలి. మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థగా దేశంలోనే పేరుగాంచిన ఆర్టీసీ తన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూనే ఆర్థిక పరిపుష్టి సాధించాలి. ఆర్టీసీ నిరంతరం ప్రజలకు సేవలు అందించాల్సిన సంస్థ. పండుగలు, పరీక్షలు వంటి కీలక సమయాల్లో కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించే పరిస్థితులు ఇప్పుడు కొనసాగుతున్నాయి. అలాంటి వాటిని రూపుమాపాలి’’ అని సీఎం అన్నారు.

ఆర్టీసీ సేవలో ప్రభుత్వ ఉద్యోగులు

ఆర్టీసీలో సమ్మె దృష్ట్యా అక్కడ సేవలందించేందుకు యుద్ధప్రాతిపదికన వివిధ శాఖలలోని ఉద్యోగులను డిప్యుటేషన్‌పై నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ల నుంచి ప్రతిపాదనలు తీసుకొని, నియామకాలు జరపాలని కలెక్టర్లను ఆదేశించింది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఖమ్మం తదితర జిల్లాల్లో సోమవారం రాత్రి వరకు కార్మిక, సహకార, నీటిపారుదల, రోడ్లుభవనాలు, తదితర శాఖల ఉద్యోగులను ఆర్టీసీకి పంపారు. వారు వెంటనే ఆర్‌ఎంల వద్ద రిపోర్ట్‌ చేయాలని కలెక్టర్లు సూచించారు.


మరిన్ని