ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ మహేశ్వరి ప్రమాణం

ఈనాడు, అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్‌ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా(సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి ప్రమాణం చేశారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌... ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌, హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం హాజరయ్యారు. సీజే నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 14కు చేరింది.

పునః ప్రమాణం
గవర్నర్‌ ప్రమాణం చేయిస్తున్న సమయంలో జస్టిస్‌ జేకే మహేశ్వరి... ‘ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సీజే’గా అని పలకడానికి బదులుగా పొరపాటున ‘చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ద హైకోర్టు ఆఫ్‌ మధ్యప్రదేశ్‌’ అని పలికారు. ప్రమాణం పూర్తయిన వెంటనే జాతీయ గీతాలాపన, తేనీటి విందుకు హాజరు కావాలని ప్రకటన వెలువడటంతో అంతా అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్లాక ప్రమాణ సమయంలో ‘మధ్యప్రదేశ్‌’ అని పలికిన విషయాన్ని సీజే దృష్టికి సిబ్బంది తీసుకెళ్లారు. దీంతో తేనీటి స్వీకరణకు ముందే గవర్నర్‌ మరోసారి జస్టిస్‌ జేకే మహేశ్వరితో ‘చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ద హైకోర్టు ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అని ప్రమాణం చేయించారు.


మరిన్ని