బెదిరింపులు పెరిగాయి

 డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులపై దాడులు, బెదిరింపు ఫోన్లు పెరిగాయని డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు చేపట్టేలా చూడాలని శుక్రవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలవనున్నట్లు తెలిపారు. బెదిరింపులకు పాల్పడే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యేలా చూడాలని కోరనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అన్ని ఉద్యోగ సంఘాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు సోమవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.

ఉద్యోగ సంఘాలతో కలిసి ఆందోళనలు: ట్రెసా
అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దారు విజయారెడ్డి హత్య నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం అన్ని ఉద్యోగ సంఘాలతో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ట్రెసా) ప్రకటించింది. ప్రత్యేకంగా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా కళాశాలల విద్యార్థులు, అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీలు నిర్వహించనున్నట్లు ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌కుమార్‌ ప్రకటించారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్ల ముందు ఆందోళనలు, దీక్షలు చేపట్టి విధులు బహిష్కరించాలని ఉద్యోగులకు సూచించారు

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన నిరసనలు
గురువారం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనలు కొనసాగించారు. కలెక్టరేట్ల ముందు దీక్షలు చేపట్టారు. సంయుక్త కలెక్టర్లు, ఆర్డీవోలు సైతం ఆందోళనలకు మద్దతు ఇచ్చారు.

విజయారెడ్డి కుటుంబానికి న్యాయం చేయండి
తహసీల్దార్‌ విజయారెడ్డి కుటుంబానికి వెంటనే న్యాయం చేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని మహారాష్ట్ర తహసీల్దార్ల సంఘం రాష్ట్రపతికి లేఖ రాసింది. తమకే అనుగుణంగా పనిచేయాలని రాజకీయ నాయకులు, సాధారణ ప్రజలు చేసే ఒత్తిడి తహసీల్దార్లపై తీవ్రంగా ఉంటుందని ఆ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు సురేష్‌ బగాలే రాష్ట్రపతికి వివరించారు.

మరిన్ని