ఔదార్యం లేదా!

అద్భుత పథకాలతో అబ్బురపరిచే మీరు ఆర్టీసీపై పెద్ద మనసు చూపలేరా?
మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం.. కార్మికులతో సంప్రదింపులు జరపండి
విధుల్లోకి చేరాలన్న సీఎం పిలుపు   బెదిరింపులా ఉంది
అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించడం కోర్టు ధిక్కరణే
కొత్త సంస్థ అయితే ఆస్తులు, అప్పులతో సంబంధమేంటి?
సమ్మెపై విచారణ సందర్భంగా హైకోర్టు
ఈనాడు - హైదరాబాద్‌

‘గతాన్ని మరిచిపోయేవారు తమ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారంటూ’ నెహ్రూ చెప్పిన విషయాన్ని మనం గుర్తించాలి. బలవంతమైన సామ్రాజ్యాలు ఎదగడాన్ని, కూలిపోవడాన్ని తెలంగాణ చూసింది. మేం పేద కుటుంబం నుంచి వచ్చాం. మా అమ్మ 13 మందిని పెంచింది. మా ముగ్గురితో పాటు దగ్గరి బంధువుల పిల్లలు 10 మంది ఉన్నారు. అందరికీ అన్నం సరిపోదని అమ్మకు తెలిసి ఉడికించేటప్పుడే నీళ్లు కాస్త ఎక్కువ పోసి గంజి తీసి దాన్ని తాగి బతికేది. అదీ తల్లి మనసు.

ప్రభుత్వాలూ అలా పెద్ద మనసు చూపాలి. ధర్మశాస్త్రాలు అదే చెబుతున్నాయి. 

రాజనే వాడు ప్రజలకు తండ్రిలాంటివాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టయినా నీ ప్రాణాన్ని రక్షిస్తాననాలి. పరశురాముడి ముందే విష్ణువు తలొంచాడు. అధికారం ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువగా వాడాలి. మా దగ్గర కోర్టు ధిక్కరణ అధికారం ఉంది. మీ అఫిడవిట్‌లు కోర్టు ధిక్కారమే. మీరన్నా, ప్రభుత్వమన్నామాకు గౌరవం ఉంది. 48 వేల మంది ఉద్యోగుల గురించి మేం ఆలోచించడంలేదు. 3 కోట్ల మంది ప్రజల గురించే ఆలోచిస్తున్నాం. 

- హైకోర్టు వ్యాఖ్యలు

న్నో అద్భుత పథకాలతో దేశాన్ని ఆశ్చర్యపరిచిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీపై ఔదార్యం చూపాలని హైకోర్టు సూచించింది. ఇక్కడ 48 వేల మంది కార్మికుల కంటే 3 కోట్ల మంది ప్రజల ఇబ్బందులనే చూస్తున్నామని పేర్కొంది. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామంటూ విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఆర్టీసీ చట్టం సెక్షన్‌ 3 కింద కొత్తగా ఏర్పాటైనట్లయితే ఆస్తి, అప్పులతో సంబంధమేముందని ప్రభుత్వాన్ని నిలదీసింది. పునర్‌వ్యవస్థీకరణ జరిగినట్లయితే దానికి కేంద్రం అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మెను సవాలు చేస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గత ఆదేశాల మేరకు ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి,  ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌లు హాజరయ్యారు.

ఇది కోర్టు ధిక్కరణ కాదా?
‘ప్రమాణం చేసి అసత్యాలు చెప్పారు. ఐఏఎస్‌ అధికారులే కోర్టును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. ఇది కోర్టు ధిక్కరణ’ కాదా అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ధర్మాసనం ప్రశ్నించింది. సీఎస్‌ జోషి సమాధానం చెబుతూ మీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారనగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ప్రమాణం చేసి దాఖలు చేసిన అఫిడవిట్‌లు చదివారా అంటూ ప్రశ్నించింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిశీలిస్తే గత నెల 29న ప్రమాణం చేసి ఇచ్చిన.. ఇప్పటి అఫిడవిట్‌కు పొంతనలేదంటే అది తప్పుడుదనే కదా అని ప్రశ్నించింది. పూర్తిగా పరిశీలించకుండానే ప్రమాణం చేసి అఫిడవిట్‌ వేశారా? దీన్ని మాత్రం ఎందుకు నమ్మాలి? కోర్టును తప్పుదోవ పట్టించడం కోర్టు ధిక్కరణ కాదా అంటూ ప్రశ్నించింది.

క్షమాపణ సమాధానం కాదు
తక్కువ సమయంలో అఫిడవిట్‌ దాఖలు చేయడంలో తప్పు జరిగిందని, క్షమించాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కోరగా ధర్మాసనం స్పందిస్తూ కాగ్‌, పీఏఓ రిపోర్టులు నిమిషాల్లో లభిస్తాయని, ప్రమాణం చేసి వేసిన రెండు అఫిడవిట్‌లను పరిగణనలోకి తీసుకోలేమంది. సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కోర్టు శిక్ష విధించాక అది తప్పంటే ఎలా... క్షమాపణ సమాధానం కాదంది.

మంత్రినే తప్పుదోవ పట్టించారు
ఆర్టీసీ ఎండీ అయితే ఏకంగా సొంత మంత్రినే తప్పుదోవ పట్టించానని ఒప్పుకొన్నారంది. ఆర్టీసీకి ఏమీ బాకీ లేదని మాకు చెబుతూ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీల నుంచి బకాయిలు రావాలంటూ మంత్రిని తప్పుదోవ పట్టించారంది. ఎక్కువ డబ్బులు రాబట్టాలని తప్పుడు సమాచారం ఇస్తారా? ఆ సమాచారాన్ని మంత్రి సీఎం దృష్టికి తీసుకెళితే దాన్ని నిజమని అనుకోరా అంటూ ప్రశ్నించింది. ఇలాంటి వాళ్లను ఎండీగా ఎందుకు కొనసాగిస్తున్నారంది. బకాయి లేనపుడు జీహెచ్‌ఎంసీకి ఎందుకు లేఖ రాశారని ప్రశ్నించింది. మంత్రి, ఆయన ద్వారా ముఖ్యమంత్రినే తప్పుదోవ పట్టించినవారు కోర్టును తప్పుదోవ పట్టించరని ఎందుకనుకుంటామంది.

ఎవరు నిజం చెబుతున్నారు?
2019-20 రూ.565 కోట్లు రీయంబర్స్‌మెంట్‌ కింద వచ్చినట్లు యూనియన్‌లు చెబుతున్నాయని, అందులో రూ.540 కోట్లు ఎంవీ టాక్స్‌ మినహాయించుకున్నట్లుందని, మరి ఇప్పుడు ప్రభుత్వం బకాయి ఉందని ఎలా చెబుతోందని ధర్మాసనం ప్రశ్నించింది. ఎవరు నిజం చెబుతున్నారు? ఎవరు అబద్ధం చెబుతున్నారు? అంతా దేవుడికే తెలియాలి.

ప్రైవేటీకరణపై నేడు విచారణ
5,100 రూట్లను ప్రైవేటీకరిస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ కోరారు. దీనిపై కూడా విచారణను ఈనెల 11న చేపడతామని ధర్మాసనం చెప్పగా ఏజీ అభ్యర్థనతో శుక్రవారం విచారణకు అంగీకరించింది.

రుణమా... సాయమా? పొంతనలేదు 

ఆర్టీసీకి రూ.3,903 కోట్లు ఇచ్చామని ఇప్పుడంటున్నారని.. మొదటి అఫిడవిట్‌లో మాత్రం రూ.3,400 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. ఆర్థిక సహకారం కింద రూ. 1,219 కోట్లు అని ఒకచోట, మరోచోట రూ. 1230 అంటారని, ఏది నమ్మాలి అని ధర్మాసనం ప్రశ్నించింది. రుణంగా ఇచ్చామంటూనే అది రుణం కాదంటారని, అసలు రుణం అర్థమేమిటో తెలుసా అని అడిగింది. మీ జీవోలన్నింటిలోనూ రుణాలుగా పేర్కొంటూ ఇప్పుడు అవన్నీ గ్రాంట్‌లు అంటున్నారంది. జీహెచ్‌ఎంసీ రూ.1,492 కోట్ల విషయంలోనూ అదే సమస్య అని, రూ.336 కోట్లు చెల్లించామంటారు, మిగిలినది చెల్లించాల్సిన అవసరంలేదంటారంది.

దేశం ఆశ్చర్యపోయే పథకాలు... ప్రాజెక్టులు చేపట్టిన రాష్ట్రం

రూ.47 కోట్లు ఇవ్వడానికి నిరాకరించారని, రూ.100 కోట్లు ఒకే నియోజకవర్గానికి, ప్రాజెక్టులకు వేల కోట్లు కేటాయిస్తున్నారని ధర్మాసనం ప్రభుత్వానుద్దేశించి వ్యాఖ్యానించింది. రైతుబంధు కింద కేంద్రం రూ.2 వేలు ఇస్తే ఇక్కడి ప్రభుత్వం ఔదార్యంతో రూ.4 వేలు ఇస్తోందంది. విద్యుత్తు రంగంలో కూడా ప్రతిభ కనబరిచిందంది. దేశానికే అద్భుతమైన ఒకే ప్రాజెక్టుతో 80 శాతం నీటి అవసరాలను తీరుస్తున్నారని, అంత చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తోందని హైకోర్టు చెప్పింది. ఈ దశలో ఏజీ జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం రూ.30 వేల కోట్ల అప్పుల్లోకి వెళ్లిందని చెప్పగా, అంత అప్పులో రూ.47 కోట్లు తెస్తే ఏమవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. అంకితభావమున్న ప్రభుత్వమని, అందుకే ప్రజలు తిరిగితిరిగి ఓట్లు వేసి గెలిపిస్తున్నారంది. ప్రభుత్వం అదే ఔదార్యాన్ని ఆర్టీసీపై చూపలేదంది. కార్మికులైనా దిగిరావాలనగా యూనియన్‌ల తరఫు సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ చివరి గడువు నిర్దేశించి బేషరతుగా విధుల్లోకి చేరాలన్నారని, చర్చలకు సిద్ధంగా లేరన్నారు. సీఎస్‌ జోషి దీంతో విభేదిస్తూ మూడుసార్లు చర్చలకు పిలిచామని, సీఎం కూడా విజ్ఞప్తి చేశారన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ అది విజ్ఞప్తి కాదని, హామీ కూడా కాదని బెదిరింపుగా ఉన్నట్లుందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వంపై చాలా గౌరవంతో మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామని, మిగిలినవారిపట్ల చూపుతున్న ఔదార్యాన్నే ఆర్టీసీపై చూపితే ప్రజలు సంతోషిస్తారన్నారంది. చర్చలను జరిపి కార్మికుల సమస్యను పరిష్కరించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామంటూ విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది.


 


మరిన్ని