జైలుకైనా వెళ్తా.. వైకాపాలో చేరను

తెదేపాలో ఉంటానన్నందుకే కక్ష కట్టారు: జేసీ

అనంతపురం, న్యూస్‌టుడే: ‘‘నన్ను వైకాపాలో చేరమని ఓ పెద్దమనిషి వచ్చాడు.. ముఖ్యమంత్రి వద్ద మీ ప్రస్తావన తీసుకొచ్చా. మన పార్టీలోకి రమ్మన్నాడు. నాదీ జవాబుదారీ... కేసులేవీ ఉండవని హామీ ఇచ్చాడు. నేను తెదేపాలోనే ఉంటా.. రానని నిర్మొహమాటంగా చెప్పా. అందుకే కక్ష కట్టి మా ట్రావెల్స్‌ బస్సులను జప్తు చేస్తున్నారు. నేను జైలుకు వెళ్లడానికి అయినా సిద్ధమే. ఎవరిని శరణు కోరాల్సిన పని లేదు’’ అని అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురంలోని ఆయన నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో జేసీ మాట్లాడారు. బస్సులు అన్నీ జప్తు చేసినా... రేపో మాపో నా గనులు తవ్వనీయకుండా ఉన్నా... మా ఊరు జూటూరు వెళ్లిపోవడానికైనా సిద్ధమే అన్నారు. ‘‘దివాకర్‌ బస్సులు జప్తు చేసిన 8 మంది అధికారులపై వ్యక్తిగత కేసుల నమోదుకు కోర్టు నుంచి నోటీసులు ఇవ్వబోతున్నా. బస్సులు జప్తు చేయడంతో నష్టపోయిందంతా కట్టించాలని కోరతా. బస్సులకు అన్ని అనుమతులు ఉన్నా కేవలం కక్ష సాధింపుతోనే కేసులు పెడుతున్నారు. బస్సులు విడుదల చేయాలని 25 రోజుల కిందటే ట్రైబ్యునల్‌ చెప్పినా వదలడం లేదు. జగన్‌ హద్దుమీరి పాలన చేస్తున్నారు’’ అని జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఈ వయసులో జేసీ వచ్చి చేసేదేముంది?
ఈనాడు, అమరావతి: తనను వైకాపాలోకి రమ్మంటున్నారని జేసీ చేసిన వ్యాఖ్యలను విలేకరులు రవాణా మంత్రి పేర్ని నానివద్ద ప్రస్తావించగా ఈ వయసులో ఆయన వచ్చి చేసేదేముందని ప్రశ్నించారు. బస్సుల విషయంలో జేసీ చెబుతున్నవన్నీ అసత్యాలేనని అన్నారు.


మరిన్ని