నచ్చిన ఆకృతిలో.. వారంలో ఇల్లు సిద్ధం!

త్రీడీ రోబోటిక్‌ సాంకేతికతతో సాధ్యమంటున్న ఒజాజ్‌ సంస్థ

ఈనాడు, సిద్దిపేట: రోబోటిక్‌ త్రీడీ సాంకేతికతతో నచ్చిన ఆకృతిలో వారం రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేయవచ్చని ఒజాజ్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారం శివారులో ఈ సాంకేతికతను ఉపయోగించి వంద చదరపు అడుగుల్లో నిర్మించిన గదిని శుక్రవారం వీరు మీడియా ప్రతినిధుల ఎదుట ప్రదర్శించారు. సంస్థ సీఈవో జాషువా మాట్లాడుతూ..  రష్యా నిపుణుల సహకారంతో త్రీడీ రోబోటిక్‌ సాంకేతికతతో ఇళ్లను నిర్మించేలా యంత్రాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ పరిజ్ఞానంతో 2 వేల చదరపు అడుగుల ఇంటిని వారంలో నిర్మించి ఇవ్వగలమన్నారు. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ సాంకేతికతను అందుబాటులోకి తెస్తామని వివరించారు. సిమెంటుతో పాటు భవన నిర్మాణాల్లో వచ్చే వ్యర్థాలు, ఇతర పదార్థాలను కలిపి రూపొందించిన మిశ్రమాన్ని నిర్మాణాల కోసం వాడతామన్నారు. పైకప్పుని ఫ్రీ కాస్టింగ్‌ పద్ధతిలో సిద్ధం చేస్తామని వివరించారు. సంప్రదాయ పద్ధతిలో నిర్మిస్తున్న ఇళ్లతో పోలిస్తే వీటికి 20 శాతం మేర ఖర్చు తగ్గుతుందని, చాలా దృఢంగా ఉంటాయని నాణ్యతా పరీక్షల్లో తేలిందని చెప్పారు.

మరిన్ని