4 వేల కిలోమీటర్ల రోడ్లు మంజూరు చేయండి

534 ఆవాసాల్లో తారురోడ్లు వేసుకుంటాం
కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి ప్రతిపాదన

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ‘‘తెలంగాణ అవసరాలు, గ్రామీణ ప్రాంతాల ప్రత్యేకత దృష్ట్యా 4 వేల కిలోమీటర్ల రోడ్లను మంజూరు చేయండి’’ అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కేంద్రాన్ని కోరారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై) 3వ దశలో 2019-20 సంవత్సరానికి 2,427.50 కిలోమీటర్లు మంజూరు చేశారని, రాష్ట్రానికి ప్రాధాన్యమిచ్చి దీన్ని 4 వేల కిలోమీటర్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. పీఎంజీఎస్‌వై, ఈ మార్గ్‌లపై కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ హరితప్లాజాలో శుక్రవారం ప్రాంతీయ శిక్షణ, సమీక్ష ముగింపు సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎర్రబెల్లి కేంద్ర అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రోడ్ల అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వ పాత్రను వారికి వివరించిన ఆయన.. అందుకనుగుణంగా రోడ్లు మంజూరు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ జనరల్‌ అల్కా ఉపాధ్యాయకు ప్రతిపాదనలు సమర్పించారు.

తప్పును గుర్తించాలి
పీఎంజీఎస్‌వైలో రోడ్లు నిర్మించేందుకు అర్హత కలిగిన 676 ఆవాసాలకు తారు రోడ్లున్నట్లు 2007లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పొరపాటున రికార్డులో నమోదు చేసింది. దీంతో ఈ గ్రామాలకు తారురోడ్లు మంజూరు కాలేదు. రాష్ట్ర నిధులతో 142 గ్రామాలకు రోడ్లు వేశాం. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పొరపాటును గుర్తించి పీఎంజీఎస్‌వై-3 దశలో కొత్తగా నిధులు మంజూరు చేస్తే మిగిలిన 534 ఆవాసాలకు తారురోడ్లు వేసుకుంటామని మంత్రి అధికారులను కోరారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 9 ఉమ్మడి జిల్లాలను కేంద్రం వెనుకబడిన ప్రాంతాలుగా ప్రకటించింది. వాటి అభివృద్ధికి 90శాతం కేంద్ర, 10శాతం రాష్ట్ర వాటాగా బీఆర్‌జీఎఫ్‌ నిధులిచ్చింది. ఆ తొమ్మిది జిల్లాలిప్పుడు 32 గ్రామీణ జిల్లాలుగా ఏర్పడినందున పీఎంజీఎస్‌వై కింద చేపట్టే పనులకు సైతం కేంద్ర వాటాగా 90శాతం నిధులివ్వాలని కోరారు.

మరిన్ని