పరిస్థితిని దిగజార్చే నిర్ణయాలొద్దు

పర్మిట్‌ల జారీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
   కేబినెట్‌ తీర్మానం ప్రత్యేకం కాదు...  మాకు అందజేయాల్సిందే
   మంత్రి మండలి ఏం  దాచాలని ప్రయత్నిస్తోంది?
   వాదోపవాదాల్లో హైకోర్టు వ్యాఖ్యలు

తెలంగాణ ఆర్టీసీ యూనియన్లు సమ్మెను కొనసాగిస్తున్నాయి. సమ్మెను చట్ట విరుద్ధమైందిగా ప్రకటించాలని.. యూనియన్లతో చర్చలు జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ మధ్యకాలంలో యూనియన్లలోనే కాకుండా ప్రజల్లోనూ ఆందోళనను పెంచే నిర్ణయాన్ని మంత్రి మండలి తీసుకుంది. పరిస్థితి మరింత దిగజారకూడదు. సమస్య తీవ్రతరమయ్యే ఎలాంటి నిర్ణయాలను తీసుకోరాదు.
-హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ విషయంలో పరిస్థితిని మరింత తీవ్రం చేసే ఎలాంటి నిర్ణయాలను తీసుకోరాదంటూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ కార్మిక యూనియన్‌ల సమ్మె నేపథ్యంలో పరిస్థితి మరింత క్షీణించకుండా పర్మిట్‌ల జారీకి సంబంధించిన నిర్ణయాన్ని సోమవారం వరకు తీసుకోరాదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఎండీలను ఆదేశించింది. మంత్రి మండలి తీర్మానాన్ని సమర్పించాలని ఆదేశించింది. 5100 పర్మిట్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ డెమోక్రటిక్‌ ఫోరమ్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ 5100 పర్మిట్‌ల జారీకి సంబంధించి కౌంటరు దాఖలు చేశామని, సోమవారం విచారణ చేపట్టాలని కోరారు. దీనికి ధర్మాసనం అనుమతిస్తూ... మంత్రి మండలి తీర్మానంతో పరిస్థితి మరింత ఉద్రిక్తం కాకుండా ఉండేందుకు తదుపరి చర్యలు తీసుకోబోమని హామీ ఇవ్వాలంది. ఏజీ జోక్యం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టానికి సవరణ తీసుకువచ్చిందని, ఆ చట్టాన్ని అమలు చేస్తున్నామనగా ధర్మాసనం స్పందిస్తూ ‘అంత తొందరెందుకు సోమవారం వరకు వేచి చూడాల’ని పేర్కొంది. 5100 పర్మిట్‌లను ప్రైవేటీకరిస్తూ మంత్రి మండలి నిర్ణయం చట్టానికి వ్యతిరేకం కాదన్న ఏజీ వాదనపై ధర్మాసనం అభ్యంతరం చెబుతూ పిటిషనర్‌ ఆరోపణలు అవేనని వ్యాఖ్యానించింది. పలు చట్టాలకు వ్యతిరేకంగా మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని ఆరోపించారంది. అయితే మోటారు వాహనాల చట్టాన్ని పరిశీలించాలని ఏజీ చెప్పగా సోమవారం విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. మధ్యంతర ఉత్తర్వులను వ్యతిరేకిస్తున్నామని ఏజీ చెప్పగా కేబినెట్‌ నిర్ణయం ఎక్కడ అని ప్రశ్నించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ స్పందిస్తూ నవంబరు 2న మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నట్లు పత్రికల్లో వచ్చిందని, తీర్మానం ప్రతి వెబ్‌సైట్‌లలో పెట్టలేదని, అది తమకు అందుబాటులో లేదని తెలిపారు.

కోర్టు ముందు ఏదీ ప్రత్యేకం కాదు

మంత్రి మండలి తీర్మానం ప్రతి ప్రత్యేకమైన (ప్రివిలైజ్డ్‌)దని, అందువల్ల దాన్ని బహిర్గతం చేయలేమని ఏజీ చెప్పారు. మంత్రి మండలి తీర్మానాన్ని వెల్లడించాలంటూ ఏ నిబంధన కూడా చెప్పలేదని పేర్కొన్నారు. ఏజీ వాదనతో ధర్మాసనం విభేదించింది. తీర్మానం చట్టబద్ధతను సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలైందని, ఈ ప్రతి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద ఉన్నప్పటికీ, అది ప్రత్యేకమైనదైనప్పటికీ కోర్టు పరిశీలనకు ఇవ్వకుండా ఉండటానికి వీల్లేదంది. కోర్టు ముందు ఏదీ ప్రత్యేకం కాదని పేర్కొంది. దాన్ని పరిశీలించకుండా చట్టబద్ధమో కాదో తేల్చడం సాధ్యం కాదంది. ఏజీ జోక్యం చేసుకుంటూ మంత్రి మండలి నిర్ణయాన్ని ఒక పౌరుడు కోర్టులో ప్రశ్నించడానికి వీల్లేదని, ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు పేర్కొందన్నారు. తమ అవగాహన కోసం మంత్రి మండలి నిర్ణయాన్ని చూడాలనుకుంటున్నామని, ఒకవేళ ఈ నిర్ణయాన్ని సవాలు చేయవచ్చని భావించినపుడే దాని చట్టబద్ధతను తేలుస్తామంది. మంత్రి మండలి నిర్ణయాన్ని వెబ్‌సైట్‌లో ఉంచరని, దాని ఆధారంగా జారీచేసిన జీవోలనే అప్‌లోడ్‌ చేస్తారని ఏజీ చెప్పారు. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం రహస్యం కాదని, అలాంటపుడు ప్రజలకు అందుబాటులో ఎందుకు ఉంచరని ధర్మాసనం ప్రశ్నించింది. మంత్రి మండలి పనిచేసేదే ప్రజల కోసమని, అది ప్రజల వాణి వినిపించడంలో భాగంగా వారికి ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపింది. ఈ కేబినెట్‌ ప్రజల నుంచి ఏం దాచాలని ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించింది. ఒక కోర్టు ముందు ఏవీ దాచడానికి వీల్లేదని, దేశభద్రతకు సంబంధించినవి కూడా కోర్టు ముందు దాచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పిటిషనర్‌ పాత్ర పరిమితమని, విషయాన్ని కోర్టు వద్దకు తీసుకురావడం వరకే అతని పని, తరువాత ప్రభుత్వం, కోర్టు మధ్యే విషయం ఉంటుందని పేర్కొంది. తీర్మాన ప్రతిని ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పజాలదని, అలా అయితే అది మీకు వ్యతిరేకంగా ఉందని భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. ఎవిడెన్స్‌ చట్టంలోని సెక్షన్‌ 114 ప్రకారం వ్యతిరేక సాక్ష్యంగా పరిగణించాల్సి ఉందనగా, అయితే ఉత్తర్వులు జారీ చేయాలని ఏజీ కోరారు.

ఆశ్చర్యం కలిగించే ధోరణి

మంత్రి మండలి తీర్మాన ప్రతిలో అంత రహస్యం ఉందనుకోవడంలేదని, ప్రభుత్వ ధోరణి ఆశ్చర్యం కలిగిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కోర్టు నుంచే ఉత్తర్వులు రావాలని ఆశిస్తోందంది. మంత్రి మండలి నిర్ణయం పిటిషనర్‌కు అందుబాటులో లేదని, ఈ వ్యవహారం న్యాయ సమీక్షలో ఉందని, అందువల్ల తీర్మానానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదంది. ఆర్టీసీ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ మంత్రి మండలి తీర్మానం చూడకుండా ఒక నిర్ణయానికి రాకూడదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ముందు కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. పిటిషన్‌ విచారణార్హం కాదంటే కౌంటరు దాఖలు చేయాలని, అది లేకుండా మేం ఉత్తర్వులిస్తే, తమ అభ్యంతరాలు వినకుండా ఉత్తర్వులిచ్చారని సుప్రీంకోర్టుకు చెబుతారంది. వాదనలు పూర్తయ్యాక... ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో పరిస్థితిని మరింత తీవ్రం చేసేలా నిర్ణయం తీసుకోరాదంటూ ధర్మాసనం విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.

కేంద్ర చట్టసవరణ మేరకే: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

ప్రైవేటు బస్సులకు 5100 పర్మిట్‌లు జారీ చేయాలంటూ ఈ నెల 2న మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మోటారు వాహనాల సవరణ చట్టం-19లోని సెక్షన్‌ 67(1)(డి)కి లోబడి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి తెలిపారు. ప్రైవేటీకరణను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఆయన శుక్రవారం కౌంటరు దాఖలు చేశారు. సవరణ ప్రకారం రవాణాలో పోటీతో ప్రయాణికులకు సౌకర్యం, టిక్కెట్ల ధరలు తగ్గించడం, ఓవర్‌లోడ్‌ను నియంత్రించడం, రహదారి భద్రతకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్ర రవాణా, ప్రాంతీయ రవాణా సంస్థలకు ఆదేశాలు జారీ చేయవచ్చన్నారు. సెక్షన్‌ 67(3) ద్వారా ఏ పర్మిట్‌నైనా సవరించవచ్చని, సమర్థమైన రవాణా సౌకర్యం, సరకుల రవాణా పథకాలను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం గెజిట్‌ జారీ చేయవచ్చన్నారు. స్టేజి క్యారియర్‌లను ప్రోత్సహిస్తూ సుప్రీం కోర్టు 1992లో ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కేబినెట్‌ నిర్ణయాల్లో జోక్యం చేసుకోరాదంటూ సుప్రీం కోర్టు తీర్పులు వెలువరించిందన్నారు. పిటిషన్‌లోని అంశాలను తోసిపుచ్చుతూ, పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.

మరిన్ని