అయోధ్య తీర్పు నేడే

134 సంవత్సరాల వివాదంపై... నిర్ణయం వెలువరించనున్న సుప్రీం
సెలవు రోజైనా తీర్పు ఇవ్వబోతున్న ధర్మాసనం
దేశమంతటా ఉత్కంఠ... భద్రత కట్టుదిట్టం
బలగాల పహారాలో అయోధ్య.. భారీగా భద్రత

 

ఈనాడు, దిల్లీ: యావద్దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఉదయం 10.30కు ఈ తీర్పును వెలువరించనుంది. ఈ మేరకు సుప్రీం కోర్టు తన అధికారిక వెబ్‌సైట్‌లో ఒక నోటీసును శుక్రవారం రాత్రి అప్‌లోడ్‌ చేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా అయోధ్యతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీగా బలగాలను మోహరించారు. ధర్మాసనంలోని ఐదుగురు జడ్జీలకు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. వారి నివాసాల వద్ద పహారాను పెంచారు. ప్రధాన న్యాయమూర్తికి అత్యున్నత స్థాయి జడ్‌ ప్లస్‌ రక్షణను కల్పించారు. దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో పంపే సందేశాలపై పర్యవేక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు.

హింసను, విద్వేషాలను ప్రేరేపించే సందేశాలను పంపేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు శాంతి భద్రతలను కాపాడాలని, తీర్పును గౌరవించాలని రాజకీయ నేతలు, మత పెద్దలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల హిందూ, ముస్లిం మతపెద్దలతో సుహృద్భావ సమావేశాలను పోలీసులు నిర్వహించారు. అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపై హిందూ, ముస్లిం పక్షాల నడుమ దశాబ్దాలుగా వివాదం నెలకొంది. ఆ భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్‌లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్‌చేస్తూ సుప్రీం కోర్టులో 14 అపీళ్లు దాఖలయ్యాయి. ఈ వివాద సానుకూల పరిష్కారం కోసం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎఫ్‌ఎం ఖలీఫుల్లా, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌, సీనియర్‌ న్యాయవాది శ్రీరాంపంచు నేతృత్వంలో మధ్యవర్తిత్వ సంఘాన్ని కోర్టు ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ ప్రయత్నాలు ఫలించలేదు.

దీంతో రాజకీయంగా సున్నితమైన ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 6 నుంచి రోజువారీ విచారణ మొదలుపెట్టింది. ఏకబిగిన 40 రోజుల పాటు విచారణ జరిపి, గత నెల 16న తీర్పును వాయిదా వేసింది. భారతదేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిన కేశవానంద భారతి కేసు విచారణ (68 రోజులు) తర్వాత అత్యంత సుదీర్ఘంగా విచారణ జరిగిన వ్యాజ్యంగా అయోధ్య కేసు రికార్డులకెక్కింది. ఈనెల 17న పదవీ విరమణ చేయబోతున్న జస్టిస్‌ గొగొయి అసాధారణ రీతిలో న్యాయస్థానానికి సెలవు రోజైన శనివారం తీర్పు ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

యూపీ ఉన్నతాధికారులతో సీజేఐ భేటీ
తీర్పుపై సుప్రీం కోర్టులో నోటీసు పెట్టడానికి కొద్ది గంటల ముందు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్‌ తివారీ, డీజీపీ ఓం ప్రకాశ్‌ సింగ్‌తో జస్టిస్‌ రంజన్‌ గొగొయి సమావేశమయ్యారు. ప్రధాన న్యాయమూర్తి చాంబర్‌లో దాదాపు గంట పాటు ఈ భేటీ జరిగింది. ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతిభద్రతల రక్షణకు చేపట్టిన చర్యలను వివరించారు.

భద్రతా వలయంలో అయోధ్య
తీర్పు నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌ అంతటా 144 సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించారు. రాష్ట్రంలోని అన్ని విద్యా, శిక్షణ సంస్థలకు సోమవారం వరకూ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. కేంద్రం 4వేల పారామిలటరీ బలగాలను పంపింది. దిల్లీ, మధ్యప్రదేశ్‌లో శనివారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయోధ్యలో బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పట్టణాన్ని దుర్బేధ్యంగా మలిచారు. పోలీసులు ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. రామజన్మభూమి న్యాస్‌కు సంబంధించిన ‘కార్యశాల’, రామజన్మభూమి పోలీసు స్టేషన్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ‘‘అయోధ్యతో పాటు యూపీలోని సున్నితమైన అన్ని జిల్లాల్లో సరిపడా బలగాలను మోహరించాం. రాష్ట్ర పోలీసులతోపాటు పారామిలటరీ దళాలనూ దించాం’’ అని శాంతి భద్రతల అదనపు డీజీ పి.వి.రామశాస్త్రి పేర్కొన్నారు. ‘‘బలగాల సంఖ్యనే కాకుండా వారి సన్నద్ధత సామర్థ్యాన్ని పెంచాం. మెరుగైన సాధన సంపత్తి, శిక్షణ ఇచ్చాం. సీనియర్‌ అధికారులు ఎప్పటికప్పుడు వ్యూహరచన చేస్తున్నారు. పర్యవేక్షణ కోసం డ్రోన్‌ కెమెరాలను ఉపయోగిస్తున్నాం. పరిస్థితి చేయిదాటిపోతే జాతీయ భద్రతా దళాన్ని (ఎన్‌ఎస్‌జీ) దించుతాం.  ఉగ్రవాద నిరోధక దళం, బాంబు నిర్వీర్యక దళాలు, సత్వర ప్రతిస్పందన విభాగాలను మోహరించాం’’ అని చెప్పారు.

అయోధ్యలో 60 కంపెనీల ప్రావిన్షియల్‌ ఆర్మ్‌డ్‌ కానిస్టేబులరీ (పీఏసీ), పారామిలటరీ దళాలను మోహరించినట్లు అదనపు డీజీ (ప్రాసిక్యూషన్‌) అశుతోష్‌ పాండే చెప్పారు. 30 చోట్ల 10 డ్రోన్‌ కెమెరాలు, సీసీటీవీలను ఏర్పాటు చేశామన్నారు. తాత్కాలిక ఆలయం వద్ద అదనపు బారికేడ్లను ఏర్పాటుచేసినట్లు వివరించారు. పట్టణం మొత్తాన్నీ 31 సెక్టార్లుగా, 35 ఉప సెక్టార్లుగా విభజించామని చెప్పారు. ఒకవేళ పట్టణంలో సందర్శకుల సంఖ్య పెరిగితే శివార్లలో వారిని నిలిపి ఉంచేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులను రాముడి దర్శనానికి బ్యాచులుగా పంపుతామన్నారు. అయోధ్యకు భక్తులు రాకుండా ఎలాంటి నిషేధం విధించలేదని చెప్పారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా లఖ్‌నవూ, అయోధ్యలో రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచినట్లు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అంతకుముందు చెప్పారు. రాష్ట్రంలోని పౌర, పోలీసు అధికారులతో శుక్రవారం రాత్రి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలవారీగా పరిస్థితిని సమీక్షించారు. శాంతి భద్రతలను దెబ్బతీయడానికి ప్రయత్నించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు కేంద్ర హోంశాఖ సూచనల మేరకు మిగతా రాష్ట్రాల్లోనూ సమీక్ష సమావేశాలు జరిగాయి. దిల్లీలోనూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నోయిడాలో పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌ చేశారు.

శాంతిసామరస్యాల పరిరక్షణ, సుహృద్భావం అనేది మన సుసంపన్న సంప్రదాయం. అందుకే, ‘అయోధ్య’పై సుప్రీంకోర్టు నిర్ణయం ఈ అత్యున్నత సంప్రదాయాన్ని మరింత పరిపుష్టం చేసేలా చూడటం మనందరి ప్రప్రధమ ప్రాధాన్యం కావాలి.  దేశప్రజలందరికీ అదే నా అభ్యర్థన. తీర్పు అనంతరం కూడా మైత్రి, సయోధ్యలను మనం చక్కగా కాపాడుకోవాలి.

-ప్రధాని నరేంద్ర మోదీ

సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే ఈ తరుణం దేశానికి పరీక్షా సమయం లాంటిది. ఉద్వేగాలు తీవ్రంగా ఉన్నా రాజ్యాంగ ఔన్నత్యానికీ, న్యాయపాలనకు భంగం కలగదని ఆశిస్తున్నాం. అన్ని వర్గాలూ సంయమనం పాటించాలని, న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంచాలి.

-దిల్లీ జమా మసీద్‌ షాహీ ఇమామ్‌ బుఖారీ

‘అయోధ్య’పై నిర్ణయమేదైనా సయోధ్యను విస్మరించరాదు!

‘‘సుప్రీంకోర్టు ‘అయోధ్య’ కేసులో ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించినా దానిని ఏ ఒక్క వర్గానికో  గెలుపు? లేదా ఓటమి? అనే కోణం నుంచి చూడనే కూడదు. శాంతిసామరస్యాల పరిరక్షణ, సుహృద్భావం అనేది మన సుసంపన్న సంప్రదాయం. అందుకే, ‘అయోధ్య’పై సుప్రీంకోర్టు నిర్ణయం ఈ అత్యున్నత సంప్రదాయాన్ని మరింత పరిపుష్టం చేసేలా చూడటం మనందరి ప్రప్రథమ ప్రాధాన్యం కావాలి.  దేశప్రజలందరికీ అదే నా అభ్యర్థన. తీర్పు అనంతరం కూడా మైత్రి, సయోధ్యలను మనం చక్కగా కాపాడుకోవాలి. సర్వోన్నత న్యాయస్థానంలో ఈ కేసు విచారణ  జరిగినంత కాలం సమాజంలోని అన్ని వర్గాలూ సుహృద్భావ పరిస్థితులు కొనసాగేలా చేసిన కృషి శ్లాఘనీయం.  అది అభినందనీయం.
- ప్రధాని నరేంద్రమోదీ

‘సుప్రీం’ తీర్పు ఎలా ఉన్నా శాంతి విలసిల్లాలి
-  కేటీఆర్‌ ట్వీట్‌

ఈనాడు, హైదరాబాద్‌: అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉన్నా శాంతి, జ్ఞానం విలసిల్లుతుందనే ఆశాభావాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి  కేటీ రామారావు వ్యక్తం చేశారు.  తాను ఏడాది క్రితమే ఈ అంశంపై ఒక ప్రసార మాధ్యమం ముఖాముఖిలో తన అభిప్రాయాన్ని వెల్లడించానని శుక్రవారం ట్విటర్‌లో ఆయన పేర్కొన్నారు.

మరిన్ని