భాజపాతో తెరాస మిలాఖత్‌!

సీఏఏను వ్యతిరేకిస్తూ శాసనసభ ఎందుకు తీర్మానం చేయలేదు?
వారి ఆరేళ్ల పాలనలో పుర అభివృద్ధి శూన్యం
మెజారిటీ స్థానాలు కాంగ్రెస్‌కే
అన్ని వర్గాలకు అండగా మా మేనిఫెస్టో
కాంగ్రెస్‌ హయాంలోనే పట్టణాల అభివృద్ధి
ఈనాడు ముఖాముఖిలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో కాంగ్రెస్‌ హయాంలోనే పట్టణాలు, నగరాల అభివృద్ధి జరిగిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆరేళ్ల తెరాస పాలనలో పట్టణాల్లోని అంతర్గత రోడ్లను పైపులైన్ల పేరిట తవ్వేయడం తప్ప చేసింది శూన్యమని ఆరోపించారు. కార్లు పడిపోయే ఫ్లై ఓవర్లను కాంగ్రెస్‌ ఎప్పుడూ కట్టలేదన్నారు. పురపాలక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. భాజపాతో మిలాఖత్‌ అయింది తెరాసనే అని ఆరోపించారు. పట్టణాలు, నగరాల్లో పౌరసేవలు, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తామన్నారు. పురపాలనలో అవినీతి రహిత, పారదర్శక పాలన కాంగ్రెస్‌ అజెండా అని ఈనాడుకు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో ఆయన స్పష్టం చేశారు.

ఆరేళ్లలో తెరాస పురపాలనపై మీ అభ్యంతరం
మాటలు తప్ప ఆరేళ్లుగా సీఎం కేసీఆర్‌, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ నగరాలు, పట్టణాలకు చేసిందేమీ లేదు. ఎలాంటి సమస్యలు పరిష్కారం కాలేదు. రియల్‌ ఎస్టేట్‌ అక్రమాలు, అక్రమ లేఅవుట్లు పెరిగాయి. పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో పాలన అవినీతిమయమైంది. ఏడాదికేడాదికి పురపాలన బడ్జెట్‌లో కోతలు విధించారు. రాష్ట్ర జనాభాలో 40 శాతం అంటే 1.8 కోట్ల మంది పట్టణాల్లో ఉన్నారు. 40 లక్షల కుటుంబాలు పట్టణాల్లో ఉంటే కనీసం ఒక శాతం కాదు 0.1 శాతం కుటుంబాలకు కూడా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వలేదు. ప్రతి ఇంటికి నల్లా ఏర్పాటు చేసి మిషన్‌ భగీరథ నీళ్లు ఇస్తామన్నారు? ఇచ్చారా? వాళ్లు చేసింది మాత్రం మిషన్‌భగీరథ పైపులైన్ల పేరుతో అంతర్గత రోడ్లను తవ్వేయడమే.

తెరాసను ఒంటరిగా ఎదుర్కోలేక కాంగ్రెస్‌-భాజపా ఒక్కటయ్యాయని కేటీఆర్‌ ఆరోపించారు?
భాజపాతో మిలాఖత్‌ అయింది కేసీఆర్‌, తెరాసనే. ఇది ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికల్లో భాజపాకు మద్దతిచ్చింది తెరాసనే. నోట్లరద్దు, జీఎస్టీకి అనుకూలంగా మాట్లాడింది కేసీఆరే. గజ్వేల్‌ సభలో నిధులు వద్దు.. ప్రధాని ప్రేమ ఉంటే చాలని కేసీఆర్‌ అనలేదా? ఇవన్నీ చూస్తే ఎవరు.. ఎవరికి మద్దతిచ్చారో స్పష్టమవుతుంది. సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీను వ్యతిరేకిస్తూ రాష్ట్ర శాసనసభ ఎందుకు తీర్మానం చేయలేదు? నిజంగా వ్యతిరేకిస్తే కేరళలో చేసినట్లు అసెంబ్లీని సమావేశపరిచి తీర్మానం చేయాలి కదా? చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటి?

కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను ఎలా సమాయత్తం చేశారు?
పురపాలక సంఘాల పదవీకాలం ముగిసినప్పటి నుంచి ఎన్నికలు జరుగుతున్న పది నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంఘాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు సమాయత్తమయ్యారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి బీ-ఫారాలిచ్చే ప్రక్రియ కూడా పూర్తయింది.

పురపాలక శాఖకు తెరాస ప్రభుత్వమిచ్చిన నిధుల్లో 10 శాతమైనా కాంగ్రెస్‌ ఇచ్చిందా అని కేసీఆర్‌ అంటున్నారు?
పురపాలనకు కాంగ్రెస్‌ పాలనలో ఇచ్చినన్ని నిధులు మరెప్పుడూ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్రం, ప్రధానంగా కేంద్రమంత్రిగా జైపాల్‌రెడ్డి ఉన్నపుడు ప్రతి పురపాలక సంఘానికి రూ.వంద కోట్లకు తగ్గకుండా నిధులిచ్చారు. పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో అనేక ప్రాజెక్టులు అప్పుడే వచ్చాయి.

ఎన్నికలను అడ్డుకునేందుకు మీరు ప్రయత్నించారని తెరాస ఆరోపించింది..
కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలను ఎప్పుడూ అడ్డుకోలేదు. ఓటరు జాబితాలు లేకుండా, రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ఎన్నికల షెడ్యూలు విడుదల చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశాం. ఆఖరు నిమిషంలో రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులు, మహిళలు ఎలా నామినేషన్లు వేస్తారు. రాత్రి ఏడుగంటలకు హైకోర్టు కేసు కొట్టేస్తే ఎనిమిది గంటలకు ప్రకటన ఇచ్చారు. ఉదయం పదిగంటల కల్లా నామినేషన్లు ఎలా దాఖలయ్యాయి. ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరుపైనే మా అభ్యంతరం.

మీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు
అవినీతి రహితపాలన అందిస్తాం. శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యమిస్తాం. ఆస్తిపన్ను భారం కాకుండా చూస్తాం. తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాలు మెరుగుపరుస్తాం.    పురపాలక పట్టణాల్లో విద్య, వైద్య సదుపాయాలు పెంచుతాం. అంతర్గతరోడ్లకు ప్రాధాన్యం. డిగ్రీ, జూనియర్‌ కాలేజీలు, పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తాం. క్రీడా సౌకర్యాలు అభివృద్ధి చేస్తాం. హరితహారం మాటలకు పరిమితం కాకుండా పచ్చదనం పెంచుతాం. పేదలకు వంద గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.ఆరు లక్షల తోడ్పాటు అందిస్తాం. రజకులకు ఆధునిక దోబీఘాట్ల నిర్మాణం, నాయీ బ్రాహ్మణులకు, కుమ్మరులకు స్థలాలిస్తాం. ఎన్జీఓల తోడ్పాటుతో కాంగ్రెస్‌ గెలిచిన పురపాలక సంఘాల్లో మధ్యాహ్నం, రాత్రి రూ.5 భోజనం. పురపాలక పట్టణాల్లో మూడు, కార్పొరేషన్లలో రీడింగ్‌ రూంలతో ఉన్న ఐదు గ్రంథాలయాలు, సీసీటీవీలు ఏర్పాటు చేస్తాం. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రాష్ట్ర స్థాయి మేనిఫెస్టో, పురపాలక సంఘాల వారీగా స్థానికంగా మేనిఫెస్టోలు విడుదల చేస్తాం.

పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటెందుకు వేయాలి?
పురపాలనకు కాంగ్రెస్‌ స్పష్టమైన హామీ ఇస్తోంది. ప్రతి పౌరుడికి అవసరమైన పౌర సేవలు అందిస్తాం. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యమిస్తాం. అవినీతి రహితంగా పారదర్శక పాలన అందిస్తాం. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి చేస్తాం.


కాంగ్రెస్‌ కార్యకర్తలు,  నాయకులకు ఏం చెబుతారు

పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు సామరస్యంతో ఉండి కలిసికట్టుగా పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలి. 


కాంగ్రెస్‌ విజయావకాశాలపై మీ ధీమా..

ఈసారి పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుంది. తెరాస పాలనలో ప్రజలకు ఎలాంటి మేలూ జరగలేదు. కాంగ్రెస్‌కు సానుకూలత పెరిగింది. శాసనసభ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలొచ్చాయి. మూడు ఎంపీ స్థానాలు గెలవడమే కాకుండా రెండింటిలో స్వల్పతేడాతో ఓడాం. ప్రజల్లో మార్పు వచ్చింది. పురపాలక ఎన్నికల్లోనే కాదు 2023లో కూడా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది.


మరిన్ని