ఇచ్చి పుచ్చుకుందాం

కృష్ణా, గోదావరి అనుసంధానంపై ఏకాభిప్రాయం
భేటీలో ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ నిర్ణయం
ఆరు గంటల పాటు ఏకాంత చర్చలు
9, 10 షెడ్యూళ్ల సమస్యలపై త్వరలో సమావేశం
విభజన సమస్యలపైనా భేటీ కావాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు ఆదేశాలు


ఇరు రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా, అవసరాలకు దెబ్బ తగలకుండా కృష్ణా-గోదావరి అనుసంధానం చేపట్టాలి.. సంబంధిత పథకాలపై నిర్మాణాత్మక ప్రణాళిక రూపకల్పనకు ఉభయ రాష్ట్రాల ఇంజినీర్లు త్వరలోనే సమావేశం కావాలి.


ఈనాడు - హైదరాబాద్‌

రిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ప్రజలకు ప్రయోజనం కలిగించేలా అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌ రావు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. కృష్ణానది నీటి లభ్యతలో ఏటా అనిశ్చితి నెలకొంటున్నందున గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే విషయంలో ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. 9, 10 షెడ్యూళ్లలోని అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడానికి అంగీకారం తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం తెలంగాణ, ఏపీ సీఎం కార్యాలయాలు అధికారిక ప్రకటన ద్వారా వివరాలు వెల్లడించాయి. సమావేశం పూర్తి సుహృద్భావ వాతావరణంలో జరిగిందని, పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని తెలిపాయి. మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి ఎనిమిదింటి వరకు దాదాపు ఆరు గంటల పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. మధ్యాహ్నం జగన్‌ ప్రగతిభవన్‌కు రాగా కేసీఆర్‌ ఆయనకు ఘనస్వాగతం పలికారు. శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానించారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ కేసీఆర్‌ వెంట ఉన్నారు.  జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి వచ్చారు. విజయసాయిరెడ్డి కేసీఆర్‌కు పాదాభివందనం చేయబోగా ఆయన వారించారు. కేసీఆర్‌ మనవడు, కేటీఆర్‌ తనయుడు హిమాన్ష్‌ జగన్‌ను కలసి ఆయనతో ఫొటో దిగారు. ముందుగా జగన్‌ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌లు మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఇద్దరు సీఎంలు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, దేశ, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

గోదావరి, కృష్ణల అనుసంధానంపై...
గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించే విషయంలో ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ‘‘కృష్ణానదిలో నీటి లభ్యత ప్రతీ ఏడాది ఒకే రకంగా ఉండడం లేదు. చాలా సందర్భాల్లో నది ద్వారా నీరు రాక, ఆయకట్టు పరిధిలోని రాయలసీమ, తెలంగాణలో మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో పుష్కలమైన లభ్యత ఉన్న గోదావరి నీటిని తరలించి, అవసరమైన సందర్భంలో కృష్ణా ఆయకట్టు రైతులకు ఇవ్వడమే వివేకవంతమైన చర్య. నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులను ఉపయోగించుకుంటూనే గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించాలి. దీనివల్ల తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో అనుకున్నట్లుగా గోదావరి నీటిని కచ్చితంగా తరలించవచ్చు’’ అని సమావేశంలో స్థిర నిర్ణయం తీసుకున్నారు. రెండు రాష్ట్రాల్లోని తాగు, సాగునీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాల్లోకి జలాల తరలింపుపై చర్చించారు. గోదావరి నీటిని ఎక్కడి నుంచి ఎటు తరలించాలి? ఎలా వినియోగించాలి? సంబంధిత నమూనా ఎలా ఉండాలి? అనే విషయాలపై తదుపరి సమావేశంలో మరింత విపులంగా చర్చించాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. అలాగే ఉద్యోగుల అంతరరాష్ట్ర బదిలీలు, విద్యుత్‌ ఉద్యోగుల విభజన, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు, ఏపీ పౌరసరఫరాలశాఖకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన క్యాష్‌క్రెడిట్‌ తదితర అంశాలపైనా చర్చించారు.


విభజన చట్టంపై

‘‘విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని వివిధ అంశాలపై అనవసర పంచాయితీ ఉంది. దీన్ని త్వరగా పరిష్కరించుకోవాలి. పరస్పర సహకారం, అవగాహనతో వ్యవహరిస్తే దీన్ని పరిష్కరించడం పెద్ద కష్టం ఏదీ కాదు’’ అని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. సమావేశం నుంచే వారు తమ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో ఫోన్లో మాట్లాడారు. సంబంధిత అంశాలను పరిష్కరించుకునే దిశలో త్వరలోనే భేటీ కావాలని ఆదేశించారు. ముందుగా తెలంగాణ సీఎస్‌ సహా అధికారుల బృందం ఏపీకి వెళ్లాలని, అలాగే ఏపీ సీఎస్‌ ఆధ్వర్యంలోని అధికారులు తెలంగాణకు రావాలని సూచించారు.


తరచూ సమావేశాలు..

ఇకపై ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం, పరస్పర సహకారం కోసం తరచుగా సమావేశాల నిర్వహణకు అంగీకరించారు. ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన పోలీసు శాఖలో డీఎస్పీ పదోన్నతులకు సంబంధించిన అంశాలపైనా సీఎంలు చర్చించి, ఆదేశాలు జారీచేశారు.మరిన్ని