చెత్త కమ్మేస్తోంది.. మురుగు ముంచేస్తోంది!

పట్టణాల్లో అస్తవ్యస్త పరిస్థితి

కొండల్లా మారిన డంపింగ్‌ యార్డులు

మురుగు శుద్ధి మాటలకే పరిమితం

పట్టణాలు, నగరాల్ని చెత్త కమ్మేస్తుండగా.. మురుగు ముంచేస్తోంది. రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్నా.. ఘనవ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి శుద్ధిపై చిత్తశుద్ధి కొరవడుతోంది. కొండల్లా పేరుకుపోతున్న చెత్త.. మురుగునీటితో నిండుతున్న చెరువులు పట్టణ జీవనాన్ని కాలుష్యమయం చేస్తున్నాయి. ఆరోగ్య సమస్యలతో పురజనులు సతమతమవుతున్నారు. రాష్ట్రంలో 128 పురపాలక సంఘాలు, 13 నగర పాలక సంస్థలు ఉండగా.. హైదరాబాద్‌ మినహా మరెక్కడా ఘనవ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి జరుగుతున్న దాఖలాలు లేవు. వీటిని ఊరు దాటించడమే గొప్ప అన్నట్లుగా ఉన్న పురపాలక యంత్రాంగాల తీరు మారాల్సిన ఆవశ్యకతను ప్రస్తుత పరిస్థితులు నొక్కి చెబుతున్నాయి.

‘భూగర్భం’లో పనులు..

* రాష్ట్రంలో సుమారు 40 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా అరకొర మురుగునీటి పారుదల వ్యవస్థతో జనం ఇబ్బందులు పడుతున్నారు. కోట్ల లీటర్ల మురుగు పోగవుతోంది.
* కరీంనగర్‌లో భూగర్భ డ్రైనేజీ పనులైనా.. ఆ వ్యవస్థ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు.
* నిజామాబాద్‌లో పనులు తుది దశలో ఉన్నాయి.
* నల్గొండ, మిర్యాలగూడ, వికారాబాద్‌లలో కోట్లు వ్యయం చేసినా.. ఏళ్లు గడుస్తున్నా.. వినియోగంలోకి రాలేదు.
* వరంగల్‌ స్మార్ట్‌సిటీగా ఉన్నా.. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ప్రతిపాదనలకే పరిమితమైంది.
* రాష్ట్రంలో కచ్చా మోరీల ద్వారా మురుగు సరఫరా 70 పట్టణాల్లో ఇంకా కొనసాగుతోంది. సమగ్ర మురుగునీటి వ్యవస్థపై దృష్టి సారించాల్సి ఉంది.

 


 


నాగ్‌పుర్‌.. వనరులపై ముందుచూపు

వర్షపాతం తక్కువగా ఉండే విదర్భ ప్రాంతంలోని ముఖ్య నగరం నాగ్‌పుర్‌. 50 కి.మీ దూరంలోని కనాన్‌ నది, పెంచ్‌ డ్యామ్‌ల నుంచి ఈ నగరానికి తాగునీటిని తీసుకుంటున్నారు. వర్షపాతం తక్కువగా ఉండటం, పెరుగుతున్న జనాభా నేపథ్యంలో తాగునీటి వనరులను కాపాడుకోవాలని నగరపాలిక నిర్ణయించింది. పీపీపీ పద్ధతిలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ప్రాజెక్టు కింద రూ.130 కోట్ల వ్యయంతో మురుగుశుద్ధి ప్లాంటును నిర్మించింది. రోజుకి 480 మిలియన్‌ లీటర్లను శుద్ధిచేసి పారిశ్రామిక అవసరాలకు పంపిణీ చేస్తోంది. తద్వారా రోజుకి 12 లక్షల మందికి అదనంగా తాగునీటిని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. మురుగునీటి శుద్ధితో వెలువడే వ్యర్థాల ద్వారా సీఎన్‌జీ ఉత్పత్తి చేస్తోంది.


చెత్త‘శుద్ధి’ ఏదీ?

* నగరాలు, పట్టణాలకు చెత్త ముప్పు ముంచుకొస్తోంది. వేల టన్నుల చెత్త నగరాలు, పట్టణాల చుట్టూ పేరుకుపోతుండటంతో శివారు ప్రాంతాల ప్రజలు సతమతమవుతున్నారు.
* రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్వహణ ఆలోచనలు ఆచరణ రూపం దాల్చకపోవడంతో నగరాలు, పట్టణాల చుట్టూ నిత్యం వేల టన్నుల చెత్త పేరుకుపోతోంది. హైదరాబాద్‌ మినహా ఇతర డంపింగ్‌ యార్డుల్లో కిలో చెత్తను కూడా ప్రాసెస్‌ చేసిన దాఖలాలు లేవు. ఇంటింటికీ చెత్త సేకరణ జరుగుతున్నా.. నిర్వహణ మాత్రం అధ్వానంగా ఉంది.
* కరీంనగర్‌లో డంపింగ్‌ యార్డు నిండిపోవడంతో శివారులో పదెకరాలు అదనంగా తీసుకున్నారు.
* చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల్లో ఒకటి ఇప్పటికే మూతపడగా... మరొకటి ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. 


బల్‌పూర్‌.. వ్యర్థాలకు పరమార్థం

మధ్యప్రదేశ్‌లో 16 లక్షల జనాభాతో మూడో అతిపెద్ద నగరమైన జబల్‌పూర్‌ ఘనవ్యర్థాల నిర్వహణలో ఆదర్శంగా నిలుస్తోంది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా ఘనవ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంటును నిర్మించింది. ప్రత్యేక వ్యవస్థ ద్వారా నగరంలోని 2.5 లక్షల గృహాల నుంచి చెత్తసేకరణను కార్పొరేషన్‌ స్వయంగా పరిశీలిస్తోంది. 60 ప్రాంతాల్లో భూగర్భ డబ్బాలు ఏర్పాటు చేసి.. 90 శాతం నిండగానే అందులో నుంచి చెత్తను తొలగిస్తున్నారు. ప్లాంటులో చెత్తను మండించడం ద్వారా రోజుకి 11.5 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. డంపింగ్‌ యార్డులను ఆధునికంగా తీర్చిదిద్దుతున్నారు. 


రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో (హైదరాబాద్‌ మినహా) 600 ఎంఎల్‌డీలకుపైగా మురుగు నీరు ఏర్పడుతోంది. సుమారు పది పట్టణ స్థానిక సంస్థల నుంచి మురుగు.. నదుల్లోకి చేరుతుండగా.. మిగతా పట్టణాలు, నగరాల నుంచి చెరువుల్లో కలుస్తోంది.

- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని