రేడియో వెంకట్రామయ్య కన్నుమూత

మూసాపేట, న్యూస్‌టుడే: ఆకాశవాణి... వార్తలు చదువుతున్నది డి.వెంకట్రామయ్య.. అంటూ తెలుగు రాష్ట్రాల పాత తరం ప్రజలకు సుపరిచితమైన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది. రేడియో రాంబాబుగా లక్షల మంది శ్రోతల గుండెల్లో కొలువుదీరిన దివి వెంకట్రామయ్య(78) హైదరాబాద్‌లో సోమవారం కన్నుమూశారు.కృష్ణా జిల్లా దొండపాడులో జన్మించిన వెంకట్రామయ్య.. 1963లో ఆకాశవాణిలో చేరారు. న్యూస్‌ రీడర్‌గా, వ్యాఖ్యాతగా, అనువాదకుడిగా 34 ఏళ్ల పాటు సేవలందించారు. నాటక రచయితగా గుర్తింపు పొందారు. 80 కథలు, రెండు నవలలు, 30 వ్యాసాలు రాశారు. సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వెలువడిన ‘పంతులమ్మ’ చిత్రానికి స్క్రిప్టు రచయితగా పనిచేశారు. రెండేళ్ల క్రితం ఆయన రచనలను ‘కథలు’, ‘ఆకాశవాణిలో నా అనుభవాలు’ పేరుతో ఎమెస్కో ప్రచురించింది. ప్రస్తుతం హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో వెంకట్రామయ్య నివాసం ఉంటున్నారు. సోమవారం మధ్యాహ్నం సినిమా చూడటానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించేసరికే తుదిశ్వాస విడిచారు.

సీఎం సంతాపం
వెంకట్రామయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్‌  సంతాపం తెలిపారు. హైదరాబాద్‌ ఆకాశవాణి కేంద్రంలో వివిధ విభాగాల్లో వెంకటరామయ్య చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. వెంకట్రామయ్య మృతిపట్ల తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ, ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌, బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌, ఆకాశవాణి సిబ్బంది సంఘం, హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లు సంతాపం తెలిపాయి. మంగళవారం ఈఎస్‌ఐ సమీపంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని ప్రెస్‌క్లబ్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.

మరిన్ని