అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా భాగ్యనగరం

మంత్రి కేటీఆర్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, న్యూస్‌టుడే కంటోన్మెంట్‌: అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు భాగ్యనగరం వేదికగా మారుతోందని పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. సోమవారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కైట్‌, స్వీట్‌ ఫెస్టివల్‌ను ఆయన ప్రారంభించారు. కైట్‌ ఫెస్టివల్‌ అంటే గతంలో అహ్మదాబాద్‌ మాత్రమే గుర్తొచ్చేదని, ప్రస్తుతం హైదరాబాద్‌ అందుకు చిరునామాగా మారిందన్నారు. ఐదేళ్ల క్రితం గాలి పటాలతో మొదలై నేడు 1000 రకాల మిఠాయిలు, అనంతరం పిండి వంటకాలు ప్రదర్శించేలా అభివృద్ధి చెందిందన్నారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, థాయిలాండ్‌, టర్కీ దేశాల కైట్‌ ఫ్లైయర్లు వారి పతంగులను పరిచయం చేసేందుకు నగరానికి రావడం సంతోషకరమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం ప్రముఖ పాత్ర వహిస్తోందని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ భూపతిరెడ్డి, సాంస్కృతిక, పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎండీ మనోహర్‌, సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని