బెయిల్‌ మీద తిరుగుతున్నది జగనే: లోకేశ్‌

ఈనాడు, గుంటూరు, బాపట్ల, న్యూస్‌టుడే: ‘తెదేపా జాతీయ కార్యాలయం వద్ద 500 మంది పోలీసులను పెట్టారు. మేం ఎక్కడికి పోతున్నాం. మా వద్ద పోలీసులెందుకు? మేం బెయిల్‌పై తిరగడం లేదు. బెయిల్‌ మీద తిరిగేది జగనే. ఆయన వద్ద పోలీసులను పెట్టండి. ఆయన ఎప్పుడు తప్పించుకుపోతారో తెలియదు...’ అని  తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ పోలీసులకు సూచించారు. గుంటూరు జైలులో ఉన్న 19మంది రైతులను ఆయన సోమవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ చినకాకానికి సమీపంలోని ఎన్నారై జంక్షన్‌ వద్ద రైతు వీరాంజనేయులు టీ తాగుతూ అక్కడ ఏం జరుగుతోందని ఆరా తీసిన పాపానికి కేసు పెట్టారు. సుదీర్ఘకాలం సైన్యంలో పని చేసి వీఆర్‌ఎస్‌ తీసుకున్న ఆసిఫ్‌ అనే వ్యక్తిని ఉద్యమానికి సంఘీభావం పలికారని అరెస్టు చేశారు. రాస్తారోకో, ఎమ్మెల్యే వాహనంపై దాడితో సంబంధం లేని అనేక మంది రైతులు, రైతు కూలీలు, విద్యార్థులను కేసుల్లో ఇరికించారు....’ అని వివరించారు. జాతీయ మహిళా కమిషన్‌ పర్యటన సజావుగా సాగలేదని, వారు బాధితులకు సమయం కేటాయించకుండా అధికారులతోనే గంటల తరబడి మాట్లాడారని పేర్కొన్నారు. కాకినాడ ఎమ్మెల్యేపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రాస్తారోకో కేసులో పోలీసులు అరెస్టు చేసిన 19 మందిలో 11 మంది సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు. మాజీ మంత్రి పుల్లారావు, ఎంపీ గల్లా జయదేవ్‌, మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, శ్రావణ్‌కుమార్‌, పార్టీ నేతలు కోడెల శివరాం, కోవెలమూడి నాని, కనపర్తి శ్రీనివాస్‌, జేఏసీ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

విరాళాలు సేకరించిన లోకేశ్‌
బాపట్లలో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశం, బహిరంగసభ సందర్భంగా లోకేశ్‌ పాదయాత్ర నిర్వహించారు. జోలె పట్టి ఉద్యమం కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. బాపట్ల తెదేపా నేత వేగేశ్న నరేంద్రవర్మరాజు రూ.3లక్షల విరాళం ప్రకటించారు.


జోలె పట్టిన గల్లా జయదేవ్‌

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: రాజధాని తరలింపు ఆలోచనను వ్యతిరేకిస్తూ తెనాలిలో ఐకాస ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో సోమవారం పాల్గొన్న ఎంపీ గల్లా జయదేవ్‌ ఉద్యమ రైతుల కోసం జోలె పట్టారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఐకాస ప్రతినిధులతో కలిసి విరాళాలు సేకరించారు. చిరు వ్యాపారులు, రైతులు, కూలీలు, మహిళలు ముందుకొచ్చి తమ వంతు విరాళాలు అందించారు. ఎంపీ జయదేవ్‌ మాట్లాడుతూ రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు.


అమ్నెస్టీకి ఫిర్యాదు చేద్దాం

‘రాజధానిలో మహిళలపై దాడిని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థకు ఫిర్యాదు చేస్తే వారు ప్రధాని మోదీకి తగిన సూచనలు చేస్తారు. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది.

- బుచ్చిరాంప్రసాద్‌, ప్రవాస భారతీయుడు

మరిన్ని