ఎవరు వీళ్లు... సరిగ్గా ఆపదలో ఆదుకుంటున్నారు. ఆశలు వాడిపోకుండా గొడుగు పడుతున్నారు. వీరేమన్నా దేవుళ్లా... కాదు వాళ్లు క్లాస్మేట్స్... వీళ్ల గురించి తెలుసుకోవాలంటే ముందు ఓ వ్యక్తి గురించి తెలుసుకోవాలి... ఆయన చదువు కోసం పడ్డ కష్టమేంటో చూడాలి. ఎదగడానికి ఆయన చేసిన కృషి ఎంతో వినాలి. ఈ క్రమంలో ఆయనకొచ్చిన ఓ మహోన్నతమైన ఆలోచన గురించి చదవాలి.
* స్వామిది నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్. నిరుపేద కుటుంబం. మెడిసిన్‌లో సీటు సంపాదించాడు. ప్రవేశ రుసుం కట్టే స్తోమత లేదు. చుట్టాల్లో, పక్కాల్లో అడిగిచూశాడు. ఎవరూ చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఇక ఏ ఆశాలేదు. ఎంబీబీఎస్ చేసే అవకాశమే లేదు. కళ్లముందే కన్న కలలన్నీ నీరుగారిపోతుంటే... అప్పుడొచ్చారు వాళ్లు. మేమున్నాం... నువ్వు ముందడుగెయ్ అన్నారు... రూ.4 లక్షలు తీసుకొచ్చి చేతిలోపెట్టారు. ఇప్పుడు స్వామి ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ మెడికల్ కళాశాల(రిమ్స్)లో మెడిసిన్ చేస్తున్నాడు. * ఆకారపు రిష్మిత... ఊరు వరంగల్. తండ్రి చిరువ్యాపారి. ఆర్థికంగా అంతంతమాత్రం కుటుంబం. ఈ పరిస్థితుల్లోనూ పట్టుదలతో చదివింది. నాగర్‌కర్నూల్ మండలం ఉయ్యాలవాడలోని గురుకుల విద్యాలయంలో పదో తరగతి, వరంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఎంసెట్‌లో ర్యాంకు వచ్చింది. మెడిసిన్ చదివే అవకాశం వచ్చింది. కానీ డబ్బుల్లేవు. అమ్మానాన్న ఏం చేయాలో దిక్కుతెలియని స్థితిలో ఉన్నారు... అప్పుడొచ్చారు వాళ్లు. భుజం తట్టారు. ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి అండగా నిలిచారు. తక్షణం ఫీజుకోసం రూ. 70 వేలు ఇచ్చారు. తరవాత మరో రూ.లక్ష... అంతేకాదు ఏటా రూ.50 వేల చొప్పున ఇస్తూ వచ్చారు. ఇప్పుడు రిష్మిత కరీంనగర్లో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతోంది. * నాగర్‌కర్నూల్‌కు చెందిన వంశీదీ, కుమార్దీ ఇలాంటి నేపథ్యమే. కష్టపడి చదివారు. మంచి ఉద్యోగం సంపాదించాలని కలలు కన్నారు. కాలం కలిసిరావట్లేదు. ఆర్థికంగా ఎవరూ ఆదుకోవట్లేదు. అప్పుడొచ్చారు వాళ్లు... వంశీ సీఏ చేయడానికి, కుమార్ ఎంటెక్ చేయడానికి రూ.లక్ష చొప్పున సాయం అందించారు.
ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం గుడిగానిపల్లికి చెందిన ఆర్.రాఘవేందర్ది నిరుపేద కుటుంబం. చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నా.. ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. గ్రామంలో తల్లిదండ్రులు మోదుగ ఆకులను సేకరించి విస్తరాకులు కుడుతూ అమ్మితే వచ్చిన డబ్బులతోనే బతకాలి. వీటిని విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ ఖర్చులకే సరిపోయేది. ఇక చదువులు ఎలా..? అయినా.. తల్లిదండ్రులను ఒప్పించి ఏదో విధంగా 7వ తరగతి పూర్తిచేశారు. 8వ తరగతి చదువుతుండగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో మధ్యలోనే మానేసి కర్నూలు జిల్లా నందికొట్కూరుకు వలసవెళ్లారు. అక్కడ చిన్నాచితకా పనులు చేస్తూ 10వ తరగతి వరకు చదివారు. మళ్లీ ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో హైదరాబాద్ వెళ్లి పనులు చేస్తూ మళ్లీ కొంత డబ్బు సంపాదించారు. ఆ డబ్బుతో దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేశారు. మళ్లీ ముంబయి పయనం. డబ్బుల సంపాదన. తిరిగి హైదరాబాద్ చేరుకొని దూరవిద్యలో బీఈడీ శిక్షణ పూర్తిచేశారు. కష్టపడి చదివి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. తాడూరు మండలం అల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 2001లో ఉపాధ్యాయుడిగా మొదటి నియామకం. ఇక తన కష్టాలు గట్టెక్కినట్లే. కుటుంబాన్ని చక్కగా పోషించుకునే స్థితి వచ్చేసినట్లే.
చాలామంది ఇక్కడే ఆగిపోతారు. గతాన్ని మర్చిపోతారు.
రాఘవేందర్ అలాకాదు. భోజనం లేక ఇబ్బంది పడుతూ చదువు మానేసిన పరిస్థితులు ఆయన మనసుపొరలను తొలిచేవి. పేదరికంతో ఎంతోమంది చదువులకు దూరమవుతున్నారన్న వాస్తవం ఆయనను వేధిస్తూ ఉండేది. వృత్తిపరంగా ఎంతటి స్థాయికి ఎదిగినా, వ్యక్తిగతంగా ఎంత డబ్బు, ఆస్తి సంపాదించినా.. మనిషిగా విఫలమైనట్లేనని అనుకున్నారు. తనవంతుగా పేద విద్యార్థులను ఆదుకోవాలన్న సంకల్పంతో.. తాడూరు మండలం యాదిరెడ్డిపల్లిలో ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్న సమయంలో 2009, డిసెంబరు 9న ‘క్లాస్మేట్ క్లబ్’ సంస్థను ఏర్పాటుచేశారు. ఓ పేద విద్యార్థి చదువుకోవడానికి ఆర్థికంగా ప్రోత్సహిస్తే ఆ కుటుంబం పేదరికం నుంచి గట్టెక్కుతుందన్న ఆలోచన ఆయనది. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యంగా రాఘవేందర్ ఏర్పాటుచేసిన క్లాస్మేట్ క్లబ్... మిగిలిన ఉపాధ్యాయులు, వివిధ శాఖల ఉద్యోగులనూ ఆలోచింపజేసింది. 2011 నాటికి క్లాస్మేట్ క్లబ్లో 10 మంది సభ్యులు చేరారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతిభావంతులైన పేద విద్యార్థులను గుర్తించి ఆర్థిక సాయం చేయడాన్ని ప్రారంభించారు. క్రమంగా ఈ సంకల్పానికి రాఘవేందర్ మిత్రులతోపాటు ఇతర ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వారి మిత్రులు, బంధువులు అండగా నిలిచారు. క్లాస్మేట్ క్లబ్లో సభ్యులుగా మారారు. ఈ క్లాస్మేట్ క్లబ్లో ప్రస్తుతం 500 మంది సభ్యులు చేరారు. ఏడు జిల్లాల్లోని పేద విద్యార్థులకు అండగా నిలుస్తోందీ సంస్థ. నాగర్‌కర్నూల్‌తో పాటు మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పేద విద్యార్థులకు కల్పవృక్షంగా మారి చదువుల నీడనిస్తోంది. పేద విద్యార్థులు తాము ఎంచుకొన్న లక్ష్యాన్ని చేరుకోడానికి వారికి వెన్నంటి ఉండి ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయిస్తోంది. ఇప్పటివరకు 100 మంది పేద విద్యార్ధులకు రూ.2500 నుంచి రూ.4 లక్షల వరకు చేయూతనిచ్చి వారి ఆశయాలకు జీవం పోస్తోంది.
భారీగా విరాళాలు ఇందులోని ఒక్కో సభ్యుడు రోజుకు రూపాయి చొప్పున ప్రతి సంవత్సరం రూ.365 విరాళంగా అందజేస్తారు. సభ్యుల పుట్టిన రోజు, వారి పిల్లల పుట్టిన రోజు, వివాహ దినోత్సవాలతోపాటు ఇతర సందర్భాల్లోనూ అదనంగా రూ.2,500 నుంచి వీలైనంత ఎక్కువ మొత్తం క్లబ్‌కు అందజేస్తారు. క్లబ్ సభ్యులే కాకుండా ఇతరులు కూడా విరాళాలు అందజేస్తుంటారు. |
క్లబ్ సేవలు ఇలా.. విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తూ వారు జీవితంలో స్థిరపడేందుకు క్లబ్ సభ్యులు అండగా నిలుస్తున్నారు. కొందరు వీరి సహకారంతో ఇప్పటికే చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగ, ఉపాధి రంగాల్లో నిలదొక్కుకున్నారు. మరోవైపు వివిధ సందర్భాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు టెన్నిస్, బాస్కెట్‌బాల్, క్రికెట్, వాలీబాల్ తదితర క్రీడా పోటీలను నిర్వహించి బహుమతులు అందజేస్తున్నారు.ఏలేటి ప్రభాకర్‌రెడ్డి, మహబూబ్‌నగర్
|
క్లాస్మేట్ క్లబ్లో 500 మంది సభ్యులు ఉన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి డివిజన్‌కో కార్యవర్గం ఉంది. కార్యవర్గ సభ్యులు తమ డివిజన్ పరిధిలోని ప్రతిభ గల పేద విద్యార్థులను గుర్తించి క్లబ్‌కు తెలియజేస్తారు. ‘ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేకపోతున్న విద్యార్థులు’ అని దినపత్రికల్లో వచ్చే కథనాలను కూడా పరిగణలోకి తీసుకొంటారు. విద్యార్థుల స్థితిగతులు, అవసరాలు గుర్తించి ఆర్థికంగా ఆదుకుంటారు. క్లబ్ సభ్యులు నేరుగా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆర్థికసాయం అందజేస్తారు. కొన్ని సందర్భాల్లో వివిధ సమావేశాల సందర్భంగా ఎంపిక చేసిన పేద విద్యార్థులను పిలిపించి సాయం చేస్తుంటారు. |
మా నినాదం ఏంటంటే... పేద కుటుంబంలో పుట్టి పెరిగిన నేను చదువుకోసం ఎంతో కష్టపడ్డా. పేద విద్యార్థులు నా మాదిరిగా కష్టపడకుండా.. ఉన్నత చదువులు చదివి ప్రయోజకులవ్వాలన్న ఉద్దేశంతో క్లాస్మేట్ క్లబ్ సంస్థను |