GDP growth estimates: భారత జీడీపీ వృద్ధి అంచనాల్లో క్రిసిల్‌ కోత

2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి అంచనాల్లో ప్రముఖ రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ కోత విధించింది....

Published : 01 Jul 2022 14:46 IST

ముంబయి: 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి అంచనాల్లో ప్రముఖ రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ కోత విధించింది. తొలుత 7.8 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందన్న సంస్థ దాన్ని తాజాగా 7.3 శాతానికి సవరించింది. అధిక ఇంధన ధరలు, ఎగుమతుల వృద్ధి నెమ్మదించడం, అధిక ద్రవ్యోల్బణమే వృద్ధి అంచనాల్లో కోతకు ప్రధాన కారణమని తెలిపింది.

ఆర్‌బీఐ సైతం ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి 7.2 శాతంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. కమొడిటీ ధరలు పెరగడం, సరఫరా ఛార్జీలు ఎగబాకడం, ఎగుమతులు నెమ్మదించడం, ప్రపంచవ్యాప్తంగా వృద్ధి అంచనాలు తగ్గడం, వ్యక్తిగత వినియోగం తగ్గడం వంటి పరిణామాలు వృద్ధిపై ప్రభావం చూపనున్నట్లు క్రిసిల్‌ వివరించింది. ప్రత్యక్ష సేవలు, సాధారణ వర్షపాతం మాత్రమే కొంత సానుకూలంగా కనిపిస్తున్న అంశాలని తెలిపింది.

జీడీపీపై ప్రధానంగా ప్రభావం చూపే ద్రవ్యోల్బణం వృద్ధికి విఘాతం కలిగించనున్నట్లు క్రిసిల్‌ పేర్కొంది. ఈ ఏడాది ద్రవ్యోల్బణం 6.8 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని లెక్కగట్టింది. దేశీయ పంట దిగుబడులపై వేడిగాలుల ప్రభావం సహా అంతర్జాతీయంగా కమొడిటీ ధరలు పెరగడం, ఇన్‌పుట్‌ ధరలు ఎగబాకడం ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణంగా చూపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని