Stock Market Opening bell: ఫ్లాట్‌గా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market Opening bell: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి...

Published : 19 Aug 2022 09:40 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకరంగానే ఉందన్న ఫెడ్‌ వ్యాఖ్యల్ని అక్కడి మదుపర్లు ఇంకా అప్రమత్తంగానే భావిస్తున్నారు. మరోవైపు ఆసియా పసిఫిక్‌ సూచీలు నేడు స్తబ్ధుగా కదలాడుతున్నాయి. అయితే, బలమైన కార్పొరేట్‌ ఫలితాలు, చమురు ధరలు దిగిరావడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్ల వంటి సానుకూల పరిణామాల నేపథ్యంలో మార్కెట్లకు కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:29 గంటల సమయానికి సెన్సెక్స్‌ 09 పాయింట్ల స్వల్ప లాభంతో 60,307 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 02 పాయింట్లు లాభపడి 17,959 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.74 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, విప్రో, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, రిలయన్స్‌, మారుతీ, ఐటీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

నేడు గమనించాల్సిన స్టాక్స్‌...

* ఐఆర్‌సీటీసీ: తమ వద్ద ఉన్న ప్రయాణికుల సమాచారాన్ని మోనిటైజ్‌ చేయాలని ఐఆర్‌సీటీసీ భావిస్తోంది. ప్రైవేటు, ప్రభుత్వం కంపెనీలతో వ్యాపారం చేయాలని యోచిస్తోంది. దీనికోసం ఓ కన్సల్టంట్‌ను నియమించుకునేందుకు టెండర్‌ను విడుదల చేసింది.

* విప్రో: యూకే ప్రభుత్వ ట్రెజరీకి సంబంధించి సర్వీస్‌ ఇంటిగ్రేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు అందించే కాంట్రాక్టును ఐటీ సంస్థ విప్రో దక్కించుకుంది.

* చమురు శుద్ధి కంపెనీలు: ప్రభుత్వం లీటర్‌ డీజిల్‌పై ఎగుమతి పన్నును రూ.5 నుంచి రూ.7కు పెంచింది. ఏటీఎఫ్‌పై ఈ పన్నును గతంలో రద్దు చేయగా.. ఈసారి దాన్ని లీటర్‌కు రూ.2గా నిర్ణయించింది. అయితే, చమురుపై విండ్‌ఫాల్‌ పన్నును మాత్రం టన్నుపై రూ.17,750 నుంచి రూ.13,000కు తగ్గించారు.

* అదానీ టోటల్‌ గ్యాస్‌: దేశీయ పీఎన్‌జీ ధరను ఒక్కో ఎస్‌సీఎంపై రూ.3.20 తగ్గించారు. సీఎన్‌జీ ధరను కేజీపై రూ.4.7 కుదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని