Crime news: దళిత విద్యార్థిపై దాష్టీకం.. కొట్టి చంపిన ఉపాధ్యాయుడు

విద్యార్థులకు విద్యా బుద్ధుల నేర్పి వారిని సన్మార్గంలో నడపాల్సిన ఓ ఉపాధ్యాయుడు దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఓ పదం తప్పుగా పలికాడని..........

Published : 27 Sep 2022 01:46 IST

లఖ్‌నవూ: విద్యార్థులకు విద్యా బుద్ధులను నేర్పి వారిని సన్మార్గంలో నడపాల్సిన ఓ ఉపాధ్యాయుడు దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఓ పదం తప్పుగా పలికాడని.. 15ఏళ్ల దళిత విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టి ఆ బాలుడి చావుకు కారణమయ్యాడు. 19 రోజుల పాటు మృత్యువుతో పోరాటంచేసిన ఆ విద్యార్థి నేడు తుదిశ్వాస విడిచాడు. ఈ  ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరియా జిల్లాలో జరిగింది.

విద్యార్థి నిఖిత్‌ దోహ్రే స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. క్లాస్‌ టెస్టులో భాగంగా నిఖిత్‌ ఓ పదాన్ని తప్పుగా పలికాడని ఆగ్రహించిన ఉపాధ్యాయుడు అశ్విని సింగ్‌.. ఈనెల 7వ తేదీన ఆ విద్యార్థిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. కర్రలు, రాడ్డుతో దాడిచేస్తూ.. కాలితో తన్నుతూ తానో ఉపాధ్యాయుడిననే విషయాన్ని మర్చిపోయాడు. తీవ్ర దాడి కారణంగా బాలుడు స్పృహతప్పిపడిపోయాడు. దీంతో అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం విద్యార్థి కుటుంబానికి తెలియడంతో వారు హుటాహుటిన ఆ ఆసుపత్రికి చేరుకున్నారు. బాలుడు స్పృహ కోల్పోయి స్ట్రెచర్‌పై ఉండటాన్ని చిత్రీకరించి.. సోషల్‌ మీడియాలో ఉంచగా ఆ వీడియోలు వైరల్‌గా మారాయి.

కాగా అప్పటినుంచి చికిత్స పొందుతున్న ఆ విద్యార్థి నేడు కన్నుమూశాడు. నిఖిత్‌ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరారీలో ఉన్న ఉపాధ్యాయుడి కోసం గాలిస్తున్నట్లు జిల్లా పోలీసు అధికారి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని