Anasuya: దయచేసి.. నా ట్వీట్లను రాజకీయం చేయొద్దు: అనసూయ

ప్రముఖ వ్యాఖ్యాత అనసూయ (Anasuya) నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. తన వ్యక్తిగత అభిప్రాయాలకు రాజకీయ రంగు పులమొద్దని కోరుకున్నారు...

Published : 19 Aug 2022 12:32 IST

హైదరాబాద్‌: ప్రముఖ వ్యాఖ్యాత అనసూయ (Anasuya) నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. తన వ్యక్తిగత అభిప్రాయాలకు రాజకీయ రంగు పులమొద్దని కోరారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఉదయం వరుస ట్వీట్స్‌ చేశారు. ‘‘ట్విటర్‌ వేదికగా నేను ఏం పెట్టినా.. అవన్నీ నా అభిరుచి, ఇష్టపూర్వకంగానే. ఒక వ్యక్తి, సంస్థ, సిద్ధాంతాన్ని ప్రమోట్‌ చేయడానికో..  డబ్బుల కోసమో.. ట్వీట్స్‌ చేయడం లేదు. ఏదైనా విషయంపై పూర్తి సమాచారం ఉన్నప్పుడే నేను పెదవి విప్పుతున్నాను. అలాగే, ఏదైనా అంశంపై మీరు మాట్లాడాలని కోరినా .. దానిపై సరైన అవగాహన లేనప్పుడు నేను మాట్లాడటం మానేస్తున్నా. ఒకవేళ మాట్లాడినా దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దానివల్ల నేను ఓ సొంత నిర్ణయానికి రాలేకపోతున్నా. కాబట్టి దయచేసి నా ట్వీట్లపై రాజకీయం చేయవద్దు’’ అని అనసూయ కోరారు. అయితే.. ఉన్నట్టుండి ఆమె ఈ విధంగా ట్వీట్లు పెట్టడంతో.. ‘‘అనసూయ.. మీరెందుకు ఇలా ట్వీట్స్‌ చేశారు?’’, ‘‘ఏమైంది?’’ అని కామెంట్లు పెడుతున్నారు.

గుజరాత్‌కు చెందిన బిల్కిస్‌ బానో (Bilkis Bano)పై సామూహిక అత్యాచార కేసులో విడుదలైన దోషులకు ఓ సంస్థ సన్మానం చేయడంపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటీవల ఓ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ‘‘మన దేశానికి ఇదొక మచ్చ. సన్మానం చేయడానికి వారేమైనా స్వాతంత్ర్య సమరయోధులా!! ఈరోజు బిల్కిస్‌ బానో.. రేపు వేరెవరైనా కావొచ్చు. ఇప్పటికైనా గళం విప్పండి’’ అంటూ ఆయన చేసిన ట్వీట్‌ని అనసూయ గురువారం రీట్వీట్‌ చేస్తూ.. ‘‘ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని మనం పునర్నిర్వచిస్తున్నట్లు అనిపిస్తోంది. అత్యాచారం చేసేవాళ్లను వదిలేసి.. మహిళల్ని ఇంటికే పరిమితం చేసేలా ఉన్నాం’’ అని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అనసూయ పెట్టిన ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘హైదరాబాద్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగినప్పుడు మాట్లాడని మీరు ఇప్పుడెలా మాట్లాడుతున్నారు’’ అంటూ కామెంట్లు చేశారు. నెటిజన్ల నుంచి వరుస కామెంట్లు వస్తోన్న తరుణంలోనే అనసూయ ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని