Sehwag - Akhtar: నిన్ను ఓపెనర్‌గా పంపించాలనే ఐడియా ఎవరిది..?

భారత క్రికెట్‌లో సచిన్‌-సౌరభ్ గంగూలీ ఓపెనింగ్‌ జోడీ  ఎంతో ఫేమస్‌.. అలానే సచిన్‌-వీరేంద్ర సెహ్వాగ్‌ పార్టనర్‌షిప్‌ కూడా ఇదే కోవలోకి వస్తుంది. వీరంతా తమ కెరీర్‌ను...

Published : 19 Aug 2022 10:14 IST

సెహ్వాగ్‌కు అక్తర్‌ ప్రశ్న.. ఆటగాడి పేరును వెల్లడించిన వీరూ

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత క్రికెట్‌లో సచిన్‌-సౌరభ్ గంగూలీ ఓపెనింగ్‌ జోడీ  ఎంతో ఫేమస్‌.. అలానే సచిన్‌-వీరేంద్ర సెహ్వాగ్‌ పార్టనర్‌షిప్‌ కూడా ఇదే కోవలోకి వస్తుంది. వీరంతా తమ కెరీర్‌ను మిడిలార్డర్‌ స్థానం నుంచి ప్రారంభించినవారే కావడం విశేషం. సచిన్‌, గంగూలీ అయినా కాస్త ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టేవాళ్లు.. కానీ, వీరేంద్ర సెహ్వాగ్ (వీరూ) మాత్రం తొలి బంతి నుంచే విరుచుకుపడేవాడు. మరీ ముఖ్యంగా పాక్‌పై వీరవిహారమే చేసేవాడు. అది వన్డేనా..? టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నామా అనే తేడా ఉండదు. బరిలోకి దిగితే బంతిని ఉతకడమే సెహ్వాగ్‌కు తెలుసు. అలా టెస్టుల్లో రెండు ట్రిబుల్‌ సెంచరీలను నమోదు చేశాడు. అసలు ఇంతకీ తనను మిడిలార్డర్‌ నుంచి ఓపెనింగ్‌కు పంపితే బాగుండని సూచించిన ఆటగాడు ఎవరో సెహ్వాగ్‌ వెల్లడించాడు. 

ఇప్పటి వరకు చాలామంది అభిమానులు టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీనే తీసుకొచ్చాడేమోనని భావించేవాళ్లు ఉన్నారు. అయితే.. గంగూలీ నాయకత్వంలోనే సెహ్వాగ్‌ ఓపెనర్‌గా వచ్చాడు. కానీ, తన పేరును మరొక కీలక ప్లేయర్‌ సూచించాడని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. ఓ క్రీడా ఛానల్‌లో పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌తో సెహ్వాగ్‌ ప్రత్యేక చిట్‌చాట్‌ నిర్వహించాడు. ఈ సందర్భంగా సెహ్వాగ్‌ను అక్తర్‌ ఓ ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ‘‘నిన్ను ఓపెనింగ్‌కు పంపించాలనేది ఎవరి ఐడియా?’’.. దీనికి సమాధానంగా ‘‘ఇన్నింగ్స్‌ను ప్రారంభించే స్థానంలో నన్ను దింపాలనేది అప్పటి టీమ్‌ఇండియా పేసర్‌ జహీర్‌ ఖాన్‌ ఐడియా. ఇదే విషయాన్ని కెప్టెన్‌గా ఉన్న సౌరభ్ గంగూలీకి చెప్పాడు. నేను అప్పటి వరకూ మిడిలార్డర్‌లోనే ఆడేవాడిని. అంతేకాకుండా తొలిసారి నిన్ను (షోయబ్‌) 1999లో మిడిలార్డర్‌ బ్యాటర్‌గానే ఎదుర్కొన్నా’’ అని సెహ్వాగ్‌ వివరించాడు. ఇప్పుడు తెలిసింది కదా.. సెహ్వాగ్‌ వీరవిహారం వెనుక ఉన్న మాస్టర్‌ మైండ్‌..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని